Rashmika Mandanna Post On Simran Birthday: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఇంట పుట్టినరోజు వేడుకలు సందడి చేశాయి. రష్మిక మందన్నా చిన్న చెల్లెలు సిమ్రాన్ తన 13వ ఏట అడుగుపెట్టింది.
టీనేజ్‌లోకి ప్రవేశించిన చెల్లెలి కోసం రష్మిక ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక క్యూట్ పోస్ట్ షేర్ చేశారు. ముత్యాలు పొదిగిన వైట్ డ్రెస్సులో ఉన్న సిమ్రాన్ ఫోటోలు, కేక్ కట్ చేస్తున్న దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు.
రెండో అమ్మగా మారిన రష్మిక
"13 ఏళ్లు రావడం చాలా సరదాగా ఉంటుంది.. ఈ వయసును బాగా ఎంజాయ్ చెయ్. నీకు పెద్ద హగ్గులు" అంటూ రష్మిక మందన్నా తన చిన్ని సోదరిపై ప్రేమను కురిపిస్తూ ఈ ఏజ్‌ను ఎంజాయ్ చేయమని సలహా ఇచ్చారు. రష్మిక తన సోదరి కంటే 16 ఏళ్లు పెద్దది. సిమ్రాన్ పుట్టినప్పుడు రష్మిక మందన్నా ఒక అక్కలా కాకుండా రెండో అమ్మలా ఆమె బాగోగులు చూసుకునేవారు.
సినీ కెరీర్ మొదలుపెట్టాకే
చిన్నప్పుడు సిమ్రాన్‌కు స్నానం చేయించడం, డైపర్లు మార్చడం దగ్గరనుంచి అన్నీ తానై చూసుకున్నానని రష్మిక మందన్నా గతంలో పలు ఇంటర్వ్యూలలో గుర్తుచేసుకున్నారు. 2016లో 'కిరిక్ పార్టీ' సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన రష్మిక, అప్పటినుంచి షూటింగ్‌ల కోసమే ఎక్కువ సమయం కేటాయించడంతో ఇంటికి దూరంగా ఉండేవారట.
ఎదిగిపోతున్న చెల్లెలు.. మదిలో చిన్న బాధ
కెరీర్ పరంగా రష్మిక మందన్నా స్టార్ హీరోయిన్ రేంజ్‌ను ఎంజాయ్ చేస్తున్నా వ్యక్తిగత జీవితంలో ఒక తీరని వెలితి ఆమెను వెంటాడుతోందట. "నా చెల్లెలు పుట్టినప్పటి నుంచి ఆమె ఎదుగుదలను దగ్గరుండి చూడలేకపోయాను. ఆమె ఇప్పుడు దాదాపు నా ఎత్తుకు వచ్చేసింది. గత ఎనిమిదేళ్లుగా పనిలో పడి ఇంటికి వెళ్లడం కూడా తగ్గించేశాను. ఏడాదిన్నరగా అసలు ఇంటి మొహం కూడా చూడలేదు. నా స్నేహితులు కూడా నన్ను పక్కన పెట్టేస్తున్నారు. ఇది సెలబ్రిటీ లైఫ్‌లోని చేదు నిజం" అంటూ హీరోయిన్ రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు.
విజయ్ దేవరకొండతో పెళ్లి.. కెరీర్ జోరు
వృత్తిరీత్యా రష్మికకు 2025 చాలా కలిసొచ్చింది. 'కుబేర', 'థామా', 'ది గర్ల్‌ఫ్రెండ్' వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన రష్మిక మందన్నా ఈ ఏడాది ఫిబ్రవరిలో తన సహ నటుడు, లవర్ విజయ్ దేవరకొండను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి 'రణబాలి' చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు 'కాక్‌టెయిల్ 2', 'మైసా' వంటి క్రేజీ ప్రాజెక్టులు రష్మిక మందన్నా చేతిలో ఉన్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. రష్మిక మందన్న సోదరి పేరేంటి?
రష్మిక మందన్న చిన్న సోదరి పేరు సిమ్రాన్. ఆమె వయసు ఇప్పుడు 13 ఏళ్లు.
2. రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఎప్పుడు జరిగింది?
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 ఫిబ్రవరిలో వివాహం చేసుకున్నారు. అంతకుముందు వారు 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించారు.
3. రష్మిక తదుపరి సినిమాలు ఏవి?
రష్మిక ప్రస్తుతం 'రణబాలి', 'కాక్‌టెయిల్ 2', 'మైసా' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

