Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రోహిణి నక్షత్రంతో అష్టమి తిథి.. జన్మాష్టమికి అరుదైన మహాసంయోగం.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దివ్య యోగం!

రోహిణి నక్షత్రంతో అష్టమి తిథి.. జన్మాష్టమికి అరుదైన మహాసంయోగం.. 15 ఏళ్ల తర్వాత మళ్లీ అదే దివ్య యోగం!

భారతీయ సనాతన ధర్మంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమి ముందుంటుంది. ప్రతీ ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్ష అష్టమి నాడు బాలగోపాలుడి జన్మదినాన్ని దేశవ్యాప్తంగా అద్భుతంగా నిర్వహిస్తారు.

ఇళ్లలో ఉయ్యాలలు కట్టి, లడ్డు గోపాలుడికి నూతన వస్త్రాలు అలంకరించి కృష్ణుడిని స్వాగతిస్తారు. అయితే ఈ ఏడాది అష్టమి తిథి రెండు రోజులు రావడంతో అసలు జన్మాష్టమి ఎప్పుడు జరుపుకోవాలనే దానిపై భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో పండితులు స్పష్టతనిచ్చారు.

సెప్టెంబర్ 4నే శ్రీకృష్ణ జన్మాష్టమి

గృహస్థులు, వైష్ణవ సంప్రదాయాన్ని పాటించేవారందరూ ఈ ఏడాది సెప్టెంబర్ 4 (శుక్రవారం) రోజే శ్రీకృష్ణ జన్మాష్టమిని ఘనంగా జరుపుకోవాలని పండితులు తేల్చి చెప్పారు. దీని వల్ల తేదీలపై ఉన్న సందేహం పూర్తిగా తొలగిపోయింది. శ్రావణ కృష్ణ అష్టమి తిథి సెప్టెంబర్ 4న తెల్లవారుజామున 02:25 గంటలకు ప్రారంభమై, సెప్టెంబర్ 5న రాత్రి 12:13 గంటలకు ముగుస్తుంది. అలాగే రోహిణి నక్షత్రం సెప్టెంబర్ 4న రాత్రి 12:29 గంటలకు మొదలై, సెప్టెంబర్ 5న రాత్రి 11:04 గంటల వరకు ఉంటుంది. శ్రీకృష్ణుడి జన్మ ఘట్టాన్ని అర్ధరాత్రి వేళ ఆచరించే ఆచారం ఉండటంతో, సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి నిశిత కాలంలో విధివిధానంగా లడ్డు గోపాలుడిని పూజించడం శ్రేయస్కరం.

15 ఏళ్ల తర్వాత అరుదైన మహాసంయోగం

"శ్రీకృష్ణ భగవానుడు రోహిణి నక్షత్రంలో జన్మించాడు. అందుకే అష్టమితో కూడిన రోహిణి నక్షత్రం ఏ రోజు రాత్రి పూట లభిస్తుందో, ఆ రోజే జన్మాష్టమి జరుపుకోవడం విశేష ఫలితాన్నిస్తుంది," అని ప్రముఖ పండితులు వెల్లడించారు. సరిగ్గా సెప్టెంబర్ 4న అర్ధరాత్రి వేళ అష్టమి తిథితో పాటు రోహిణి నక్షత్రం కలిసిరావడం మహా అదృష్టంగా భావిస్తున్నారు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఎలాంటి దివ్య సంయోగం ఉందో, సరిగ్గా అలాంటి అరుదైన కలయిక దాదాపు 15 సంవత్సరాల తర్వాత నేడు ఏర్పడింది. అర్ధరాత్రి సమయం, అష్టమి తిథి, రోహిణి నక్షత్రం ఈ మూడూ ఏ రోజు కలుస్తాయో ఆ రోజే ఈ పండుగ జరుపుకోవాలని శాస్త్రాలు చెబుతున్నాయి.

పూజా ముహూర్తాలు, సమయాలు

జన్మాష్టమి రోజున నిశిత కాల పూజ రాత్రి 11:57 గంటల నుంచి ప్రారంభమై 12:43 గంటల వరకు కొనసాగుతుంది. పూజ చేయడానికి మొత్తం 45 నిమిషాల సమయం లభిస్తుంది. సరిగ్గా రాత్రి 12:20 గంటలకు మధ్యరాత్రి క్షణం (జన్మ సమయం) వస్తుంది. ఈ రోజు రాత్రి చంద్రోదయం 11:29 గంటలకు ఉంటుందని పంచాంగ కర్తలు తెలిపారు. ఇక పగటిపూట పూజలు చేయాలనుకునే వారు అభిజిత్ ముహూర్తంలో అంటే ఉదయం 11:36 గంటల నుంచి మధ్యాహ్నం 12:24 గంటల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు.

ఉపవాస దీక్ష విరమణ

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి వ్రతం ఆచరించేవారు సూర్యోదయం తర్వాత పారణ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రకారంగా సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 06:01 గంటల తర్వాత భక్తులు తమ ఉపవాస దీక్షను విరమించవచ్చు.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu