Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Romanchakam Review: రోమాంచకం రివ్యూ- సందీప్ రెడ్డి వంగా ప్రయోగం- సుమంత్ ప్రభాస్, అనంతిక రొమాంటిక్ లవ్ కామెడీ ఎలా ఉందంటే?

Romanchakam Review: రోమాంచకం రివ్యూ- సందీప్ రెడ్డి వంగా ప్రయోగం- సుమంత్ ప్రభాస్, అనంతిక రొమాంటిక్ లవ్ కామెడీ ఎలా ఉందంటే?

Romanchakam Movie Review In Telugu And Rating:

టైటిల్: రొమాంచకం

టీనటులు: సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్, ఉపేంద్ర లిమాయే, వెంకటేష్ కాకుమాను, మహి, సాయి సోహన్, నరేంద్ర రవి తదితరులు

కథ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం: వేణుగోపాల్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: పవన్ ఉప్పుల

సంగీతం: వాసుకి వైభవ్

నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా

సమర్పణ: సందీప్ రెడ్డి వంగా

విడుదల తేది: సెప్టెంబర్ 3, 2026

'అర్జున్ రెడ్డి', 'యానిమల్' వంటి అత్యంత ఇంటెన్స్, యాక్షన్ సినిమాలకు పేరొందిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ నుంచి ఒక కూల్ అండ్ రొమాంటిక్ కామెడీ వస్తుందంటే సహజంగానే సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. అలా సుమంత్ ప్రభాస్ హీరోగా, అనంతిక సనీల్ కుమార్ హీరోయిన్‌గా తెరకెక్కిన సినిమా 'రోమాంచకం'.

రోమాంచకం రివ్యూ

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పించిన ఈ సినిమాను ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం థియేటర్లలో ఇవాళ (సెప్టెంబర్ 3)న విడుదల కానుంది. అయితే, ఒకరోజు ముందుగానే రోమాంచకం ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి రోమాంచకం రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హైదరాబాద్‌లో ఒక చిన్న స్టార్టప్ కంపెనీ నడుపుకునే అన్వేష్ (సుమంత్ ప్రభాస్) అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. రోమాంచకం అనే పేరుతో డేటింగ్ యాప్‌ను తీసుకురావాలనేది అన్వేష్ కల. ఇదే యాప్‌లో చెన్నైకి చెందిన మైథిలి (అనంతిక సనీల్ కుమార్)తో పరిచయం ఏర్పడి ప్రేమలో పడతాడు అన్వేష్.

మైథిలి పుట్టినరోజు తెలుసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు చెన్నై వెళ్తాడు అన్వేష్. తను ఉన్న హోటల్‌కు రమ్మని మైథిలికి చెబుతాడు అన్వేష్. వస్తానని చెప్పిన మైథిలి ఆ వెంటనే అన్వేష్‌ను ఫోన్‌లో, సోషల్ మీడియా అకౌంట్లలో బ్లాక్ చేస్తుంది. దాంతో అన్వేష్‌కు మైండ్ బ్లాక్ అవుతుంది.

రోమాంచకం ట్విస్టులు

ఆ తర్వాత ఏమైంది? అసలు మైథిలి ఎందుకు హోటల్‌కు రాలేదు? ఎందుకు అన్వేష్‌ను బ్లాక్ చేసింది? మైథిలి అదృశ్యం వెనుక కారణాలు ఏంటీ? ఎవరున్నారు? చివరికి అన్వేష్ మైథిలి కలుసుకున్నారా? అన్వేష్ డేటింగ్ యాప్ రోమాంచకం ఏమైంది? అనేదే మిగతా కథ.

విశ్లేషణ:

ఇదొక సింపుల్ లవ్ కామెడీ రొమాంటిక్ మూవీ. ప్రస్తుతం సమాజంలో డేటింగ్ యాప్స్ ఎక్కువైపోయాయి. ఆ పాయింట్‌ను ఈ సినిమాలో వాడుకున్నారు. అయితే, హీరో హీరోయిన్ల లవ్ ట్రాక్ రాగానే ఆ స్టార్టప్ డ్రీమ్ అనేది పక్కకు వెళ్లిపోతుంది. రోమాంచకం సినిమాకు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అనే క్యాప్షన్ ఇచ్చారు.

ఈ మూడింటిన కలిగలిపి తెరకెక్కించడంలో డైరెక్టర్ కాస్తా సక్సెస్ అయ్యారనే చెప్పొచ్చు. నిజానికి సినిమాలో హీరో తన గ్యాంగ్‌తో చేసే కామెడీనే హైలెట్ అవుతుంది. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సీన్లకు కొన్నిసార్లు లాజిక్ కనిపించదు. కానీ, ఫోన్ కాల్స్, మెసేజ్‌ల మధ్య సాగే వీరి లాంగ్ డిస్టెన్స్ లవ్ స్టోరీ చాలా సరదాగా సాగిపోతుంది.

దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ, స్క్రీన్‌ప్లే విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. కథనాన్ని ప్రారంభించడానికే దాదాపు 40 నిమిషాల సమయం తీసుకోవడం, ఫస్ట్ హాఫ్‌లో చాటింగ్ సన్నివేశాలను సాగదీయడం కొంత నిరాశపరుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.

సెకండాఫ్ తర్వాత మలుపు

ఆ తర్వాత కథలో వేగం అందుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో సీరియస్ పరిణామాలు, సిచ్యువేషనల్ కామెడీ కలగలిసి కథనం ఆసక్తికరంగా సాగుతుంది. కానీ, కామెడీ నుంచి ఎమోషనల్ డ్రామాకి మారే క్రమం అంత సాఫీగా సాగలేదు. క్లైమాక్స్ పర్వాలేదు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

వాసుకి వైభవ్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేయగా, పవన్ పప్పులా కెమెరా పనితనం హైదరాబాద్ నగరాన్ని ఎంతో అందంగా చూపించింది. ఎడిటింగ్‌లో శ్రద్ధ తీసుకోవాల్సింది.

హైలెట్‌గా సుమంత్ ప్రభాస్ నటన

ఈ సినిమాకు ప్రధాన బలం హీరో సుమంత్ ప్రభాస్. ఎక్కడా అతి చేయకుండా, తన నటనతో చాలా సహజంగా అలరించాడు. కామెడీ సీన్స్‌లోనే కాకుండా, సెకండ్ హాఫ్‌లో వచ్చే సీరియస్ సన్నివేశాల్లోనూ మెప్పించాడు. హీరోయిన్ అనంతికతో అతనికి ఉన్న కెమిస్ట్రీ తెరపై చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

అయితే హీరోయిన్ పాత్రకు మరింత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే కథకు బలం చేకూరేది. వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవిలతో కూడిన ఫ్రెండ్స్ గ్యాంగ్ కామెడీ టైమింగ్ సినిమాకు ప్లస్ పాయింట్. కథనంలో వేగం తగ్గినప్పుడల్లా తమ మార్కు హంగామాతో వీరిద్దరూ థియేటర్‌లో మంచి నవ్వులు పూయించారు.

ఫైనల్‌గా చెప్పాలంటే?

సీరియస్ యాక్షన్, లవ్ డ్రామా వంటి సినిమాలు కాకుండా ఒక సరదా ప్రేమకథను నిర్మించాలనే భద్రకాళి పిక్చర్స్ ప్రయత్నం మెచ్చుకోదగినదే. ఫైనల్‌గా చెప్పాలంటే ఎలాంటి అంచనాలు లేకుండా, వీకెండ్‌లో ప్రశాంతంగా నవ్వుకోవడానికి రోమాంచకం సినిమాను కచ్చితంగా చూడొచ్చు.

రేటింగ్: 3/5

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu