Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Royal Enfield Bullet 650 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650 ఎందుకు కొనాలి? 5 కారణాలు..

Royal Enfield Bullet 650 : రాయల్​ ఎన్​ఫీల్డ్​ బుల్లెట్​ 650 ఎందుకు కొనాలి? 5 కారణాలు..

Royal Enfield Bullet 650 review : భారతీయ బైక్ మార్కెట్​లో అత్యంత సుదీర్ఘ చరిత్ర కలిగిన 'బుల్లెట్' బ్రాండ్ సరికొత్త మైలురాయిని అందుకుంది.

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్.. తన ఐకానిక్ నేమ్‌ప్లేట్‌తో సరికొత్త 'బుల్లెట్ 650' బైక్‌ను ఇటీవలే మార్కెట్​లోకి విడుదల చేసింది. 1932 నుంచి నిరంతరాయంగా ఉత్పత్తిలో ఉన్న బుల్లెట్ సిరీస్‌లోనే ఇది అత్యంత పవర్‌ఫుల్ బైక్ కావడం విశేషం. కంపెనీ 650సీసీ ప్లాట్‌ఫామ్‌పై వస్తున్న 7వ మోడల్ ఇది. దీని ఎక్స్-షోరూమ్ ధరను రూ. 3.65 లక్షలుగా (క్లాసిక్ 650 ప్రారంభ ధరతో సమానంగా) నిర్ణయించారు. ప్యూర్ రెట్రో లుక్, మోడరన్ పర్ఫార్మెన్స్‌ల కలయికతో ఈ బైక్ రూపుదిద్దుకుంది.

పాత తరం బుల్లెట్ వింటేజ్ రూపాన్ని ఏమాత్రం మార్చకుండా, హైవే క్రూజింగ్‌కు అనువైన సరికొత్త ట్విన్-సిలిండర్ ఇంజన్‌తో ఈ బైక్‌ను రాయల్ ఎన్‌ఫీల్డ్ అప్‌గ్రేడ్ చేసింది.

ఈ సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 ని ఎందుకు కొనాలి? 5 ముఖ్యమైన కారణాలను ఇక్కడ తెలుసుకోండి..

1. పవర్‌ఫుల్ ఇంజన్, పర్ఫార్మెన్స్..

బుల్లెట్ 650లో ఇదివరకు ఇంటర్‌సెప్టర్ 650, సూపర్ మీటియోర్ 650 లలో నిరూపితమైన పవర్‌ఫుల్ ఇంజన్‌ను ఉపయోగించారు.

ఇంజన్: 648 సీసీ ఎయిర్/ఆయిల్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజన్.

పవర్: ఇది గరిష్టంగా 7,250 ఆర్పీఎం వద్ద 47 హెచ్​పీ పవర్‌ను, 5,650 ఆర్పీఎం వద్ద 52.3 ఎన్​ఎం టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.

గేర్‌బాక్స్: స్లిప్-అండ్-అసిస్ట్ క్లచ్ సాంకేతికతతో కూడిన 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఇది వస్తుంది. దీనివల్ల లాంగ్ రైడ్స్, సిటీ ట్రాఫిక్‌లో గేర్లు మార్చడం చాలా స్మూత్‌గా ఉంటుంది.

2. రెట్రో స్టైలింగ్, ఐకానిక్ డిజైన్..

ఈ బైక్ చూడటానికి క్లాసిక్ 650 తరహాలోనే ఉన్నప్పటికీ, బుల్లెట్ మార్క్ సిగ్నేచర్ రెట్రో ఎలిమెంట్స్ దీనికి ప్రత్యేక గుర్తింపును ఇస్తాయి.

డిజైన్ టచ్: ఇంధన ట్యాంక్​పై చేతితో గీసిన సాంప్రదాయ గోల్డ్ పిన్‌స్ట్రైప్స్ వింటేజ్ వింగ్డ్ మెటల్ బ్యాడ్జింగ్ ఉన్నాయి.

హెడ్‌లాంప్: సిగ్నేచర్ క్రోమ్ క్యాస్కెట్‌తో కూడిన రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్, వింటేజ్ స్టైల్ 'టైగర్-ఐ' పైలట్ ల్యాంప్స్ అందించారు.

రేర్ ఫెండర్: క్లాసిక్ బైక్ లాగా రౌండ్‌గా కాకుండా, బుల్లెట్ సాంప్రదాయానికి తగ్గట్టుగా బాక్సీ/స్క్వేర్ షేప్ రియర్ ఫెండర్‌ను అమర్చారు.

3. సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్..

సింగిల్-పీస్ బెంచ్ సీట్: క్లాసిక్ 650లో స్ల్పిట్ సీట్ ఉండగా.. రాయల్​ ఎన్​ఫీల్డ్ బుల్లెట్ 650లో పాతకాలపు మోడల్స్ తరహాలో పొడవైన సింగిల్-పీస్ బెంచ్ సీట్‌ను అందించారు. ఇది రైడర్, వెనుక కూర్చునే పిలియన్ ఇద్దరికీ అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది.

హ్యాండిల్‌బార్: దీని హ్యాండిల్‌బార్ పొజిషన్ కొంచెం ఎత్తుగా, స్ట్రైట్‌గా ఉంటుంది. దీనివల్ల ఎక్కువ దూరం ప్రయాణించినా అలసట లేకుండా, 'కమాండింగ్' రైడింగ్ పోశ్చర్ లభిస్తుంది.

4. నమ్మకమైన హార్డ్‌వేర్ అండ్ ఫీచర్లు..

సస్పెన్షన్: ముందు భాగంలో 120 ఎంఎం ట్రావెల్‌తో కూడిన షోవా టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక వైపు 90 ఎంఎం ట్రావెల్ ఇచ్చే ట్విన్ షాక్ అబ్జార్బర్స్ ఉన్నాయి.

వీల్స్ అండ్ టైర్స్: సాంప్రదాయ లుక్ కోసం ముందర 19-ఇంచులు, వెనుక 18-ఇంచుల వైర్-స్పోక్ వీల్స్​తో పాటు ట్యూబ్-టైప్ టైర్లను అందించారు.

బ్రేకింగ్: ముందు 320ఎంఎం, వెనుక 300ఎంఎం డిస్క్ బ్రేక్‌లతో పాటు భద్రత కోసం ఈ బైక్​లో డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ స్టాండర్డ్‌గా వస్తుంది.

టెక్నాలజీ: సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ కోసం ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ప్రీమియం రోటరీ స్విచ్ గేర్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.

5. కలర్స్ అండ్ ధర..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 650 కేవలం ఒకే ఒక స్టాండర్డ్ వేరియంట్​లో లభిస్తుంది.

ధర: రూ. 3,64,856 (ఎక్స్-షోరూమ్).

రంగులు: ఇది కానన్ బ్లాక్, ఇండియా-ఎక్స్‌క్లూసివ్ రంగు అయిన బ్యాటిల్‌షిప్ బ్లూ అనే రెండు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

బుల్లెట్ బ్రాండ్‌కు ఉన్న క్రేజ్, 650సీసీ ట్విన్-సిలిండర్ ఇంజన్ పవర్ కలవడంతో, పాతకాలపు లుక్‌తో పాటు హైవేలపై వేగంగా ప్రయాణించాలనుకునే బైక్ ప్రియులకు ఇది ఒక బెస్ట్ రెట్రో రోడ్‌స్టర్ ఛాయిస్ కానుంది!

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu