Dailyhunt
Salman Khan: 3 సార్లు గుండె మార్పిడి, సల్మాన్ ఖాన్‌తో రాత్రి 2 గంటల ఫోన్ కాల్- సర్జరీ విషయాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్

Salman Khan: 3 సార్లు గుండె మార్పిడి, సల్మాన్ ఖాన్‌తో రాత్రి 2 గంటల ఫోన్ కాల్- సర్జరీ విషయాలు గుర్తు చేసుకున్న ఫ్యాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అంటే మనకు భారీ యాక్షన్ సినిమాలు, 'బీయింగ్ హ్యూమన్' సంస్థే గుర్తొస్తాయి. కానీ, ఎవరికి తెలియకుండా ఆయన చేసే కొన్ని పనులు మనుషుల ప్రాణాలను కాపాడుతాయని తాజాగా ఒక సంఘటన నిరూపించింది.

మూడు సార్లు గుండె మార్పిడి (Heart Transplant) చేయించుకుని ప్రాణాలతో పోరాడి గెలిచిన రీనా రాజు అనే మహిళ.. సల్మాన్ ఖాన్ తన పట్ల చూపిన ఉదారతను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.

సర్జరీకి ముందు ఆ రెండు గంటల ఫోన్ కాల్!

'వాయిస్ ఆఫ్ బెంగళూరు' పోడ్‌కాస్ట్‌లో ఆర్జే సౌజన్యతో మాట్లాడిన రీనా రాజు తన మొదటి గుండె మార్పిడి సర్జరీకి ముందు జరిగిన ఒక అద్భుతమైన విషయాన్ని వెల్లడించారు. "నేను సల్మాన్ సార్‌ను నా మూడు గుండెలతోనూ ప్రేమిస్తాను. మొదటి సర్జరీకి ముందు నాకు ఆయన నంబర్ దొరికింది" అని రీనా రాజు తెలిపారు.

"ఎంతో మంది ఆయన (సల్మాన్ ఖాన్)కు మెసేజ్ చేస్తుంటారు కదా అని అనుకున్నాను. కానీ, నేను గుండె మార్పిడికి సిద్ధమవుతున్నానని తెలిశాక, ఆస్ట్రేలియాలో షూటింగ్‌లో ఉన్న ఆయన నాకు స్వయంగా ఫోన్ చేశారు" అని రీనా రాజు పేర్కొన్నారు.

సర్జరీ జరగడానికి సరిగ్గా ముందు రోజు రాత్రి సల్మాన్ ఖాన్ ఆమెతో దాదాపు రెండు గంటల పాటు మాట్లాడారట. ఆమె కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడమే కాకుండా, రీనాలో ఆత్మవిశ్వాసాన్ని నింపారట. ఆ మాటలే తనకు మళ్లీ ప్రాణం పోశాయని రీనా రాజు చెప్పుకొచ్చారు.

గుర్తుపెట్టుకుని మరీ సైకిల్ గిఫ్ట్!

రెండోసారి సర్జరీ జరిగిన తర్వాత 2018లో ముంబైలోని సల్మాన్ ఖాన్ నివాసం 'గెలాక్సీ అపార్ట్‌మెంట్స్'లో ఆయనను రీనా కలిశారు. "ఆ రాత్రంతా మేము కలిసి పార్టీ చేసుకున్నాం, పాటలు పాడుకున్నాం. ఆ తర్వాత నన్ను 'రేస్ 3' సెట్స్‌కు కూడా తీసుకెళ్లారు. ఎప్పుడో చాలా కాలం క్రితం నాకు వైట్ సైకిల్ అంటే ఇష్టమని ఆయనకు మెసేజ్ చేశాను. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుని మరీ నాకు ఒక 'బీయింగ్ హ్యూమన్' వైట్ సైకిల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆయన మనసంతా మంచితనమే నిండి ఉంటుంది" అని రీనా రాజు కొనియాడారు.

సల్మాన్ తదుపరి చిత్రాల అప్‌డేట్స్

బీయింగ్ హ్యూమన్ సంస్థతోనే కాకుండా ఫోన్ కాల్‌లో అభిమాని గుండెల్లో ధైర్యం నింపి మూడుసార్లు హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేసుకునేందుకు కారణం అయ్యారు సల్మాన్ ఖాన్. అలాంటి సల్మాన్ ఖాన్ వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆ వివరాలపై లుక్కేద్దాం.

మాతృభూమి (Maatrubhumi): అపూర్వ లఖియా దర్శకత్వంలో వస్తున్న ఈ వార్ డ్రామాలో సల్మాన్ ఇండియన్ ఆర్మీ కల్నల్‌గా కనిపిస్తారు. చైనా సైన్యానికి ఎదురొడ్డి పోరాడే ఒక వీర గాథగా ఇది తెరకెక్కుతోంది. ఏప్రిల్ 17న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తారు.

వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్: తెలుగు స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాణంలో, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సల్మాన్ ఒక భారీ యాక్షన్ డ్రామాను అనౌన్స్ చేశారు. ఏప్రిల్ నుంచే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. దిల్ రాజుతో సల్మాన్‌కు ఇది మొదటి సినిమా కావడం విశేషం.

వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా, ఒక సామాన్య అభిమాని ప్రాణం కోసం సమయం కేటాయించిన సల్మాన్ ఖాన్‌పై ఇప్పుడు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu