దేశ ఆర్థిక రాజధాని ముంబైని వరుణుడు వణికేలా చేస్తున్నాడు. శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
ఇక సోమవారం సైతం నగరంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. దీనితో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది.
స్కూళ్లు, కాలేజీలు బంద్.. ఆఫీసులు యథాతథం!
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తున్నట్లు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపింది.
"వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ముంబై పరిధిలోని అన్ని విద్యాసంస్థలకు జులై 6, 2026న సెలవు ప్రకటిస్తున్నాం," అని బీఎంసీ పేర్కొంది.
అయితే, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు మాత్రం యథాతథంగా పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రయాణాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముంబైని ముంచెత్తిన వాన.. కూలిన వృక్షాలు
ముంబైతో పాటు పరిసర జిల్లాలైన థాణే, పాల్ఘర్ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచే కుండపోత వర్షం కురిసింది. గడిచిన 24 గంటల్లో ముంబై నగరంలో 265 మిల్లీమీటర్లు, శివారు ప్రాంతాల్లో 227 మిల్లీమీటర్ల మేర రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నగరంలోని కుర్లా ప్రాంతంలో వీచిన బలమైన గాలులకు ఓ భారీ వృక్షం దుకాణంపై కూలిపడింది. ఈ ప్రమాదంలో యూనస్ కుందా వాలా (63) అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడి, ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు.
ఈ ఘటనపై ముంబై మేయర్ రీతూ తావ్డే తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను ముందే గుర్తించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె, దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం తరపున రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.
విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం..
భారీ వర్షాలు, ఈదురు గాలుల ప్రభావం ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంపై తీవ్రంగా పడింది. రన్‌వేపై నీరు చేరడం, ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు గంటపాటు విమాన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. దీనివల్ల ఇండిగోకు చెందిన నాలుగు సర్వీసులు రద్దు కాగా, ముంబై రావాల్సిన 13 విమానాలను అహ్మదాబాద్, గోవా వంటి సమీప విమానాశ్రయాలకు మళ్లించారు. వాతావరణం కాస్త కుదుటపడిన తర్వాత ఆ విమానాలు తిరిగి ముంబైకి చేరుకున్నాయి.
అప్రమత్తంగా ఉండాలని మేయర్ పిలుపు..
మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లను జారీ చేసింది. రాయగఢ్, పుణె, సతారా జిల్లాలకు అత్యంత ప్రమాదకరమైన 'రెడ్ అలర్ట్' ప్రకటించారు. ముంబై, థాణే, నాసిక్, కొల్హాపూర్ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్' ఇచ్చారు.
నగరంలో ప్రమాదాలను నివారించడానికి బీఎంసీ పరిధిలోని పాత చెట్లకు, సిమెంట్ రోడ్ల పక్కన ఉన్న చెట్లకు తక్షణమే 'ట్రీ ఆడిట్' నిర్వహించాలని మేయర్ ఆదేశించారు. అలాగే రోడ్లపై ఉన్న మ్యాన్‌హోళ్లకు రక్షణ జాలీలు ఉన్నాయో లేదో పరిశీలించాలని అధికారులను కోరారు.
"ముంబై ప్రజలందరికీ నా విన్నపం ఒక్కటే.. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకండి. సముద్ర తీరాలకు అస్సలు వెళ్లొద్దు. హైటైడ్ (సముద్రపు అలల ఉధృతి) ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున బీచ్‌ల వద్దకు వెళ్లి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు," అని మేయర్ రీతూ తావ్డే హెచ్చరించారు.
Chitturi Eswara Karthikeya Sharath

