Dailyhunt
SCR Charminar Express :  రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్'లో కీలక మార్పు

SCR Charminar Express : రైల్వే ప్రయాణికులకు అలర్ట్ - 'చార్మినార్ ఎక్స్‌ప్రెస్'లో కీలక మార్పు

తెలంగాణ నుంచి ఏపీ మీదుగా తమిళనాడుకు ప్రయాణించే చార్మినార్ ఎక్స్ ప్రెస్ కు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న గమ్యస్థానాల్లో మార్పులు చేయనున్నట్లు పేర్కొంది.

ఈ నిర్ణయం ఏప్రిల్ 5 తేదీ నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది.

చెన్నై బీచ్ స్టేషన్ వరకే…!

దక్షిణ మధ్య రైల్వే ప్రకటనలోని వివరాల ప్రకారం… ప్రస్తుతం చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తాంబరానికి వెళ్లే చార్మినార్ ఎక్స్ ప్రెస్ (రైలు నంబర్ 12760)ను ఇకపై చెన్నై బీచ్ స్టేషన్ కే పరిమితం చేశారు. ఈ మార్పు ఏప్రిల్ 5వ తేదీ నుంచి అమల్లోకి రానుంది.

మరోవైపు తాంబరం నుంచి హైదరాబాద్ కు వెళ్లాల్సిన చార్మినార్ ఎక్స్ ప్రెస్ (ట్రైన్ నంబర్ 12759) కూడా తాంబరానికి బదులుగా చెన్నై బీచ్ స్టేషన్ నుంచే నడుపుతారు. ఈ మార్పు ఏప్రిల్ 6వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది.

తాజాగా చేసిన మార్పుల ప్రకారం….. చెన్నై బీచ్ స్టేషన్ నుంచి చార్మినార్ ఎక్స్ ప్రెస్ సాయంత్రం 6.20కు హైదరాబాద్ కు బయలుదేరుతుంది. ఇక హైదరాబాద్ నుంచి బయలుదేరే చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు చెన్నై బీచ్ స్టేషన్ కు ఉదయం 7.00 గంటలకు చేరుకుంటుంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకూ ఈ మార్పు అమల్లో ఉంటుందని రైల్వే వర్గాలు తెలిపాయి.

సాధారణంగా చార్మినార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని తాంబరం వరకు రాకపోకలు సాగిస్తుంటుంది. చెన్నై ఎగ్మోర్ స్టేషన్ లో ప్రస్తుతం అభివృద్ది పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రైలును తాంబరం స్టేషన్ వరకు కాకుండా తాత్కాలికంగా చెన్నై బీచ్ రైల్వే స్టేషన్ వరకే పరిమితం చేయాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.

ఫలితంగా హైదరాబాద్ నుంచి వివిధ స్టేషన్ల మీదుగా ఈ రైలులో ప్రయాణాలు చేసే వారు తమ టికెట్లను చెన్నై బీచ్ స్టేషన్ వరకే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పనులు పూర్తి అయిన తర్వాత…. తిరిగి చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తాంబరం స్టేషన్ వరకు అందుబాటులోకి తీసుకువస్తారు.

చార్మినార్ ఎక్స్ ప్రెస్ తెలుగు రాష్ట్రాల్లోని సూళ్లూరుపేట, గూడూరు, నెల్లూరు, కావాలి, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లలో ఆగుతుంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu