వేసవి సెలవుల దృష్ట్యా తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విద్యాసంస్థలకు సెలవులు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో సాధారణ రైళ్లలో నెలకొన్న విపరీతమైన రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
అంతేకాకుండా.. తిరుమలకు వెళ్లేవారిని దృష్టిలో పెట్టుకొని రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్, కాచిగూడ, చర్లప్లి స్టేషన్ల నుండి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడుస్తాయి. ఆ వివరాలు చూద్దాం..
మే 6వ తేదీన చర్లపల్లి-తిరుపతి మధ్య ఒక ట్రిప్ ప్రత్యేక రైలు నడవనుంది. సాయంత్రం 6.55 నిమిషాలకు చర్లపల్లి నుంచి బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు జనగాం, కాజీపేట, వరంగల్, నెక్కొండ, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడురు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది.
రెగ్యులర్ వీక్లీ ట్రైన్
కాకినాడ టౌన్ నుంచి హర్యానాలోని హిస్సార్‌కు కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును అధికారులు ప్రకటించారు. కాకినాడ నుంచి మే 12వ తేదీ నుంచి ప్రతీ మంగళవారం ఈ రైలు ఉదయం 5.40కు హిస్సార్‌కు బయలుదేరుతుంది. సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మేడ్చల్, కామారెడ్డి, నిజమాబాద్, బాసర మీదుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి హర్యానాలోని హిస్సార్‌కు ప్రతీ గురువారం చేరుకోనుంది.
అలానే హిస్సార్ నుంచి ప్రతీ శుక్రవారం కాకినాడకు ఒక ట్రైన్ బయలుదేరుతుంది. ఇది కూడా ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్ర, తెలంగాణ మీదుగా కాకినాడ టౌన్ స్టేషన్ కు ప్రతీ ఆదివారం వస్తుంది. మే 15వ తేదీన ఈ ట్రైన్ మెుదలుకానుంది. ఈ రెండు రైళ్లలోనూ 2 ఫస్ట్ ఏసీ, 3 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ, 8 స్లీపర్, 4 జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉండనున్నాయి.
ఉర్సు ఉత్సవాలకు స్పెషల్ రైళ్లు
నాంపల్లి నుంచి కల్బుర్గికి ఉర్సు ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ మేరకు నాంపల్లి-కల్బుర్గి(07177/07178) ప్రత్యేక రైలు మే 2, 5 తేదీల్లో రాత్రి 11.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7 గంటలకు కల్బుర్గి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 3, 6 తేదీల్లో ఉదయం 7.40 గంటలకు కల్పుర్గి నుంచి బయలుదేరుతుంది. అదే రోజున మధ్యాహ్నం 2 గంటలకు నాంపల్లికి వస్తుంది.
Anand Sai

