Divya Dutta Remembers Shah Rukh Khan Flight Incident: వెండితెరపైనే కాదు, నిజ జీవితంలోనూ షారుఖ్ ఖాన్ ఒక 'జెంటిల్‌మెన్' అని బాలీవుడ్ బ్యూటీ, తెలుగు ఓటీటీ సిరీస్ నటి దివ్య దత్తా కొనియాడారు.
తోటి నటీనటుల పట్ల ఆయన చూపించే గౌరవం, సంస్కారం తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
షారుఖ్ అంటేనే ఒక పాజిటివ్ ఎనర్జీ
షారుఖ్ ఖాన్ వ్యక్తిత్వం గురించి దివ్య దత్తా మాట్లాడుతూ, ఆయన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని, కానీ వాటన్నింటి నుంచి ఆయన పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. తన చుట్టూ ఉన్నవారికి సంతోషాన్ని పంచడమే తన జీవిత లక్ష్యంగా షారుఖ్ మార్చుకున్నారని ఆమె ప్రశంసించారు. "షారుఖ్ చాలా సున్నిత మనస్కుడు. ఎవరికి ఏమి అవసరమో ఆయనకు బాగా తెలుసు" అని దివ్య దత్తా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
ఆ ఫ్లైట్ జర్నీ.. మరువలేని జ్ఞాపకం
ఒకసారి ఐఫా (IIFA) అవార్డుల వేడుక ముగించుకుని తిరిగి వస్తున్నప్పుడు జరిగిన సంఘటనను దివ్య దత్తా గుర్తు చేసుకున్నారు. విమానంలో షారుఖ్ ఖాన్, హీరోయిన్లతో విద్యా బాలన్, దియా మీర్జాతో కలిసి దివ్య దత్తా 'డంబ్ షరాడ్స్' (Dumb Charades) ఆట ఆడుతున్నారు. ఆ సమయంలో దివ్య తల్లి కూడా అక్కడే ఉన్నారు. షారుఖ్ తన చేష్టలతో తన తల్లిని ఆటలో భాగం చేసిన తీరు, ఆమెను పలకరించిన విధానం చూసి దివ్య దత్తా మురిసిపోయారు.
అంతేకాదు, విమానం దిగిన తర్వాత షారుఖ్‌ను చూడటానికి అభిమానులు ఎగబడ్డారు. భారీగా సెక్యూరిటీ ఉన్నప్పటికీ, తనతో పాటు ఉన్న మహిళా నటీనటులందరూ క్షేమంగా తమ కార్లలో వెళ్లే వరకు షారుఖ్ అక్కడే వేచి చూశారని దివ్య దత్తా తెలిపారు. అంత పెద్ద స్టార్ హోదాలో ఉండి కూడా తోటి వారి భద్రత కోసం ఆయన చూపిన శ్రద్ధ చూసి అందరూ ఆశ్చర్యపోయారని దివ్య దత్తా చెప్పారు.
వీర్-జారా నుంచి చిరయా వరకు
అలా విమానంలో హీరోయిన్లతో ప్రయాణం తర్వాత షారుఖ్ ఖాన్ చేసిన పనికి షాక్ అయినట్లుగా దివ్య దత్తా చెప్పుకొచ్చారు. షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా ప్రధాన పాత్రల్లో నటించిన 'వీర్-జారా' (2004) చిత్రంలో దివ్య దత్తా పోషించిన 'షబ్బో' పాత్ర ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ సినిమాతోనే దివ్య దత్తాకు భారీ గుర్తింపు లభించింది.
ఇక ఇటీవల దివ్య దత్తా చిరయా ఓటీటీ సిరీస్‌తో పలకరించింది. జియో హాట్‌స్టార్‌లో తెలుగు భాషలో కూడా చిరయా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో మంచి విజయం సాధించింది. ఈ సక్సెస్‌ను దివ్యా దత్తా ఎంజాయ్ చేస్తున్నారు.
మయసభ ఓటీటీ సిరీస్‌తో
వైవాహిక అత్యాచారం (Marital Rape) అనే సున్నితమైన సామాజిక అంశంపై తెరకెక్కిన ఈ ఓటీటీ సిరీస్ జియో హాట్‌స్టార్‌లో మార్చి 20న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇందులో కమలేష్ అనే గృహిణి పాత్రలో దివ్య దత్తా అద్భుతంగా నటించారు. అలాగే, మయసభ ఓటీటీ సిరీస్‌తో తెలుగులో డెబ్యూ ఎంట్రీ ఇచ్చి నటనతో ఆకట్టుకున్నారు దివ్య దత్తా.
Chetupelli Sanjiv Kumar, Hyderabad

