Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు  సంప్రదాయాలివే

శ్రావణ పౌర్ణమి: పాతవి వదిలి కొత్తదానికి స్వాగతం.. అంతరార్థం ఇదేనా? కొబ్బరికాయ పూజ నుంచి కొత్త జంధ్యం వరకు సంప్రదాయాలివే

శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చే పవిత్ర పండగ రక్షాబంధన్. అయితే శ్రావణ పూర్ణిమ ప్రాముఖ్యత కేవలం రాఖీ కట్టడంతోనే ముగిసిపోదు. దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని తమదైన సంప్రదాయాలు, ప్రత్యేక ఆచారాలతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు.

ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో ఇప్పుడు పరిశీలిద్దాం.

సముద్ర తీరంలో నారలీ పూర్ణిమ సంబురం

మహారాష్ట్ర, గోవా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'నారలీ పూర్ణిమ'గా పిలుస్తారు. మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున సముద్ర దేవుడైన వరుణ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వరుణుడికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్రం ప్రశాంతంగా ఉండాలని, చేపల వేటకు వెళ్లే తమ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా కాపాడాలని మత్స్యకారులు ఈ సందర్భంగా వేడుకుంటారు. కొత్త చేపల వేట సీజన్‌ను ఈ పూజతోనే ప్రారంభిస్తారు.

దక్షిణాదిలో అవని అవితమ్ విశిష్టత

ఇక దక్షిణ భారతదేశంలో ఈ పర్వదినాన్ని 'అవని అవితమ్' పేరుతో ఘనంగా జరుపుకుంటారు. ఈ పవిత్ర దినాన బ్రాహ్మణులు తమ పాత యజ్ఞోపవీతాన్ని తొలగించి, కొత్త జనేవును ధరిస్తారు. దీనిని తెలుగు రాష్ట్రాల్లో జంధ్యాల పౌర్ణమి అని అంటారు. అంతేకాకుండా ఈ రోజును జ్ఞానానికి, వేద అధ్యయనానికి ప్రతీకగా భావిస్తారు. రుషుల తర్పణాలు వదిలి కొత్త సంవత్సర వేద పఠనాన్ని ప్రారంభిస్తారు.

మధ్య భారతదేశంలో కజరీ పూర్ణిమ

మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'కజరీ పూర్ణిమ'గా పిలుస్తారు. ఇక్కడి రైతులు ఈ పండుగను వ్యవసాయం, పంటల సమృద్ధికి ముడిపెట్టి చూస్తారు. మంచి వర్షాలు కురిసి, పంటలు బాగా పండాలని కోరుకుంటూ రైతులు ప్రత్యేక పూజలు చేస్తారు. ప్రాంతాలు మారినా, పేర్లు వేర్వేరుగా ఉన్నా.. అన్ని సంప్రదాయాలూ ఒకే ఒక సందేశాన్ని ఇస్తాయి. పాత జ్ఞాపకాలను, చేదు అనుభవాలను వెనక్కి నెట్టి జీవితంలో కొత్త అడుగులు వేయాలని ఈ పర్వదినం నేర్పుతుంది.

ఆత్మావలోకనానికి సరైన సమయం

శ్రావణ పూర్ణిమ ఆధ్యాత్మిక కోణాన్ని పరిశీలిస్తే, ఇది ఆత్మపరిశీలనకు అత్యంత సరైన సమయం. శ్రావణ మాసం అందించిన ప్రశాంతత మన వేగాన్ని కాస్త తగ్గించి, అంతర్మథనం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. జీవితాన్ని కొత్త కోణంలో చూడటానికి, గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన తరుణమని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు. వర్షాకాలం తర్వాత ప్రకృతి ఎంత పచ్చగా, కొత్తగా మారుతుందో.. మనలోని ప్రతికూల ఆలోచనలను వదిలేసి సరికొత్త జీవితాన్ని ప్రారంభించాలని ఈ పూర్ణిమ మనకు గుర్తుచేస్తుంది.

నిరాకరణ: ఈ వ్యాసంలో ఉన్న సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము చెప్పము. మరిన్ని వివరాలు మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu