Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
SIR in Andhrapradesh : ఓటరు జాబితాలో మీ పేరు లేదా...? ఆగస్ట్ 30 వరకు ఛాన్స్, దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలివే

SIR in Andhrapradesh : ఓటరు జాబితాలో మీ పేరు లేదా...? ఆగస్ట్ 30 వరకు ఛాన్స్, దరఖాస్తు విధానం, కావాల్సిన పత్రాలివే

టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా జూన్ 15 నుంచి జులై 24 వరకు చేపట్టిన ఎన్యూమరేషన్ ఫారాల సేకరణ పూర్తయ్యింది. ఆ తర్వాత జూలై 31న కేంద్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.

ఈ ముసాయిదా జాబితాలో మీ పేరు లేకపోయినా, ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు సమర్పించకపోయినా, లేదా వివరాల్లో ఏవైనా తప్పులున్నా సరిచేసుకునేందుకు ఎన్నికల సంఘం ఓటర్లకు మరో అవకాశం కల్పించింది.

రాబోయే అక్టోబరు 3న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తారు. అయితే ఈ జాబితాకు ముందు, ఓటర్లు మరియు వివిధ రాజకీయ పార్టీల బూత్‌స్థాయి ఏజెంట్లు (BLA) తమ క్లెయిమ్‌లు, అభ్యంతరాలను సమర్పించేందుకు జూలై 31 నుండి ఆగస్టు 30 వరకు గడువు విధిస్తూ స్పష్టమైన షెడ్యూల్ ఖరారు చేశారు.

దరఖాస్తు విధానం…

మీ పేరు ముసాయిదా జాబితాలో ఉందో లేదో సరిచూసుకోవడానికి మరియు మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ఆన్ లైన్, ఆఫ్ లైన్ మార్గాల్లో పూర్తి చేసుకోవచ్చు.

  • అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ద్వారా పరిశీలించుకోవచ్చు. దరఖాస్తులు సమర్పించవచ్చు.
  • నేరుగా మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారులు (BLO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO), లేదా అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు (AERO) భౌతికంగా దరఖాస్తులు అందజేయవచ్చు.

2002 నాటి ఓటర్ల జాబితాతో వివరాల మ్యాపింగ్‌లో లోపాలున్న వారికి లేదా మ్యాపింగ్ చేసుకోకుండా ఎన్యూమరేషన్ పత్రాలు ఇచ్చేసిన వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. సెప్టెంబర్ 28 నాటికి ఈ నోటీసుల పరిష్కారం పూర్తికానుంది. విచారణ సమయంలో అర్హతను నిరూపించుకునేందుకు ఆధార్ కార్డు కాకుండా క్రింది 11 ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకదానిని సమర్పించాల్సి ఉంటుంది.

ఇందులో జనన ధ్రువీకరణ పత్రం, పాస్‌పోర్ట్, గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం జారీ చేసిన విద్యా సర్టిఫికెట్లు, శాశ్వత నివాస ధ్రువీకరణ పత్రం, శాశ్వత కుల ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వం జారీ చేసిన భూమి లేదా ఇంటి కేటాయింపు పత్రాలు లేదా ఇతర పత్రాల వంటివి ఉన్నాయి.

సమగ్ర విచారణ తర్వాతే తొలగింపు…

ఎన్యూమరేషన్ ప్రక్రియలో ఎవరి పేరునూ నోటీసు ఇవ్వకుండా…. సమగ్ర విచారణ జరపకుండా తొలగించరని ఎన్నికల సంఘం అధికారులు స్పష్టం చేశారు. ఒకవేళ ఈఆర్వో నిర్ణయంతో సంతృప్తి చెందని పక్షంలో….. ఆర్డర్ వచ్చిన 15 రోజుల్లోగా జిల్లా మేజిస్ట్రేట్‌కు అప్పీలు చేసుకోవచ్చు. అక్కడ కూడా తగిన పరిష్కారం లభించకపోతే 30 రోజుల్లోగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి రెండో అప్పీలు చేసుకునే వెసులుబాటును ఎన్నికల సంఘం కల్పించింది.

  • ఫాం-6 (Form 6) : కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడానికి (దీనితో పాటు నిబంధనల ప్రకారం డిక్లరేషన్ ఫాం సమర్పించాలి).
  • ఫాం-6A (Form 6A) : విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరులు (NRIలు) ఓటరుగా నమోదు చేసుకోవడానికి.
  • ఫాం-7 (Form 7) : ఓటర్ల జాబితాలో లేని, అనర్హులైన లేదా మరణించిన వారి పేర్లను తొలగించాలని అభ్యంతరం తెలిపేందుకు.
  • ఫాం-8 (Form 8) : నియోజకవర్గం లోపల లేదా వేరే నియోజకవర్గానికి చిరునామా మార్చుకోవడానికి, వివరాల్లోని తప్పుల సవరణకు, కొత్త ఎపిక్ (EPIC) కార్డు పొందేందుకు, దివ్యాంగుల వివరాల నమోదుకు దీనిని వాడాలి.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu