Best diet for skin care : చర్మ సౌందర్యం అంటే కేవలం పైన రాసుకునే క్రీములు, లోషన్లు మాత్రమే కాదు. మన శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం, కాలుష్యం, బ్యాక్టీరియా, సూర్యరశ్మి నుంచి మనల్ని రక్షించే ఒక కవచంలా పనిచేస్తుంది.
బాహ్య సౌందర్యం కంటే అంతర్గత ఆరోగ్యం చర్మంపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అందుకే మనం వాడే బ్యూటీ ప్రోడక్ట్స్ కంటే మనం తినే ఆహారంపై దృష్టి పెట్టడం ఎంతో ముఖ్యం.
ప్రస్తుత కాలంలో ఒత్తిడి, సమయానికి భోజనం చేయకపోవడం, వాతావరణ కాలుష్యం వంటి కారణాల వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతోంది. ఈ నేపథ్యంలో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆరు రకాల ఆహార పదార్థాల గురించి ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సుమన్ అగర్వాల్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
ఆహారమే అసలైన అందం!
"ఈ రోజుల్లో చాలామంది స్టాక్ మార్కెట్ షేర్లను కొన్నట్లుగా రకరకాల చర్మ సంరక్షణ సీరమ్స్‌ను కొంటున్నారు. కానీ అసలైన మెరుపు మీ ప్లేట్‌లో మీరు తినే ఆహారంలోనే దాగి ఉంది. మీ చర్మానికి సరైన పోషణను అందించండి చాలు," అని సుమన్ అగర్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
చర్మం కాంతివంతంగా, దృఢంగా ఉండాలంటే నిత్యం కింది ఆరు పదార్థాలను ఆహారంలో భాగం చేసుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
1. నీటి నిధి.. కీరదోసకాయ
కీరదోసకాయలో దాదాపు 95 నుంచి 96 శాతం నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేసి, చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. నిత్యం కీరదోసకాయ తినడం వల్ల కళ్ల కింద వాపు, నల్లటి వలయాలు తగ్గుతాయి. వేసవిలో మాత్రమే కాకుండా ఏడాది పొడవునా దీనిని తీసుకోవడం వల్ల చర్మం చల్లగా, కాంతివంతంగా ఉంటుంది.
2. మొటిమలకు చెక్ పెట్టే సబ్జా గింజలు..
చర్మ సంరక్షణలో సబ్జా గింజలను ఒక 'సూపర్ ఫుడ్'గా పరిగణిస్తారు. ఇవి శరీరంలోని టాక్సిన్స్‌ని బయటకు పంపి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. శరీరంలోని వేడిని తగ్గించడం ద్వారా మొటిమల సమస్యను ఇవి అదుపులో ఉంచుతాయి. రోజంతా చర్మం తాజాగా ఉండేలా ఇవి సహకరిస్తాయి.
3. ఆయుర్వేద రహస్యం.. పసుపు పాలు
మన పూర్వీకుల కాలం నుంచి పసుపు పాలను ఒక దివ్యౌషధంగా భావిస్తారు. ఇది కేవలం ఆరోగ్యానికే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా మేలు చేస్తుంది. పసుపులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమల వల్ల వచ్చే ఎరుపును తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా పసుపు పాలు తాగడం వల్ల చర్మ ఛాయ మెరుగుపడుతుంది.
4. విటమిన్-సీ పవర్‌హౌస్.. ఉసిరి
సిట్రస్ జాతి పండ్లన్నింటిలో కంటే ఉసిరిలో అత్యధిక విటమిన్ సీ ఉంటుంది. ఇది చర్మంపై వచ్చే నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తొలగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలను ఇది అరికడుతుంది. చర్మం లోపలి పొరల నుండి మెరిసేలా చేస్తుంది.
5. సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్.. నెయ్యి!
చాలామంది నెయ్యి తింటే లావవుతామని భయపడతారు. కానీ పరిమిత మోతాదులో నెయ్యి తీసుకోవడం వల్ల చర్మం లోపలి నుంచి మాయిశ్చరైజ్ అవుతుంది. ఇది చర్మంపై ఉండే సహజ రక్షణ కవచాన్ని రిపేర్ చేస్తుంది. చర్మం పొడిబారకుండా చూస్తూ, చిన్న చిన్న గీతలను అడ్డుకుంటుంది.
6. సూర్యరశ్మి నుంచి రక్షణ.. వాల్‌నట్స్
వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఈ, యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి రక్షిస్తాయి. చర్మం నిర్జీవంగా మారకుండా ఉండాలంటే రోజుకు 4-5 వాల్‌నట్స్ ఉదయాన్నే తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఈ ఆహార పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల చర్మంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. అయితే, ఏదైనా సరే మితంగా తీసుకోవడం ఉత్తమమని గుర్తుంచుకోవాలి.
Chitturi Eswara Karthikeya Sharath

