Dailyhunt
Sonakshi Sinha: నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా కామెంట్స్

Sonakshi Sinha: నన్ను ఎన్నిసార్లు నానమ్మను చేశారో లెక్కే లేదు.. హీరోయిన్ సోనాక్షి సిన్హా తల్లి పూనమ్ సిన్హా కామెంట్స్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌ల వైవాహిక జీవితం గురించి సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా గత ఏడాది కాలంగా సోనాక్షి గర్భవతి అంటూ వస్తున్న వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి.

ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో సోనాక్షి ఎరుపు రంగు దుస్తుల్లో మెరవగా, ఆమె తన చేతిని పొట్టపై ఉంచుకున్న తీరు చూసి నెటిజన్లు రకరకాలుగా ఊహించుకున్నారు. తాజాగా ఈ పుకార్లపై సోనాక్షి తల్లి పూనమ్ సిన్హా తనదైన శైలిలో స్పందించారు.

కూతురు పుట్టడమే మా జీవితంలో పెద్ద వేడుక!

ఒక ప్రైవేట్ కార్యక్రమంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పూనమ్ సిన్హా, తన కూతురు సోనాక్షి పుట్టినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. "మా ఇంట్లోకి ఆడపిల్ల అడుగుపెట్టిన ఆ క్షణం నా జీవితంలోనే అత్యంత అద్భుతమైన సమయం. ఆడపిల్లలు లేని జీవితం వెలితిగానే ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల ఉండటం చాలా ముఖ్యం" అని పూనమ్ సిన్హా భావోద్వేగంగా చెప్పుకొచ్చారు.

నానమ్మను చేసేశారుగా!

సోనాక్షి ప్రెగ్నెన్సీ వార్తల గురించి ప్రస్తావించగా పూనమ్ నవ్వుతూ ఇలా అన్నారు.. "సోషల్ మీడియా పుణ్యమా అని నన్ను ఇప్పటికే ఎన్నిసార్లు నానమ్మను చేసేశారో లెక్కే లేదు! అయితే ఆ సంతోషం మా జీవితంలోకి కచ్చితంగా వస్తుంది, అది జరిగేటప్పుడు అందరికీ తెలుస్తుంది" అని పూనమ్ సిన్హా క్లారిటీ ఇచ్చారు.

ఏడేళ్ల ప్రేమ.. ఆపై వివాహం

కాగా, సల్మాన్ ఖాన్ ఇచ్చిన ఒక పార్టీలో 2013లో తొలిసారి కలుసుకున్న సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్‌.. దాదాపు ఏడేళ్ల పాటు రహస్యంగా ప్రేమలో ఉన్నారు. 2017లో 'ట్యూబ్‌లైట్' సినిమా సక్సెస్ పార్టీలో వీరిద్దరి మధ్య స్నేహం బలపడింది. 2024లో ముంబైలోని సోనాక్షి నివాసంలో అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత సినీ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఇచ్చారు.

పుకార్లపై సోనాక్షి, జహీర్ స్టైలే వేరు!

గతంలో తన ప్రెగ్నెన్సీపై వచ్చిన వార్తలకు సోనాక్షి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. "కేవలం చేతిని పొట్ట మీద పెట్టుకున్నంత మాత్రాన నన్ను గర్భవతిని చేసేశారు. మానవ చరిత్రలోనే అత్యధిక కాలం (16 నెలలు) గర్భంతో ఉన్న వ్యక్తిగా మా మీడియా నాకో వరల్డ్ రికార్డ్ ఇచ్చేసింది" అని ఇన్‌స్టాగ్రామ్‌లో సరదాగా పోస్ట్ చేశారు సోనాక్షి సిన్హా.

అటు జహీర్ ఇక్బాల్ కూడా ఒక దీపావళి వేడుకలో ఫోటోగ్రాఫర్ల ముందు సోనాక్షి సిన్హా పొట్టపై చేయి వేసి 'జాగ్రత్త' అంటూ సరదాగా ఆటపట్టించారు. మొత్తానికి ఈ దంపతులు పుకార్లను పట్టించుకోకుండా తమ వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu