భావప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అని, తాము దాన్ని పూర్తిగా గౌరవిస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
అయితే స్వేచ్ఛ అంటే అపరిమితమైన హక్కు కాదని, దానికి కూడా కొన్ని చట్టపరమైన హద్దులు ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి ప్రవర్తించే వారిపై, ముఖ్యంగా మహిళలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ఆయన సోషల్ మీడియా దుర్వినియోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు, విమర్శించే స్వేచ్ఛ అందరికీ ఉంటుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలు ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అద్భుతమైన వేదికలని ఆయన కొనియాడారు. కానీ, కొందరు ఫేక్ అకౌంట్ల వెనక దాక్కుని ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫొటోల మార్ఫింగ్, మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు, దేవుళ్లు-దేవతలను అవమానించడం, హింసను ప్రేరేపించడం వంటి చర్యలు ఎంతమాత్రం సహించబోమని చెప్పారు. ఇలాంటి సైబర్ నేరాలను అరికట్టేందుకు కూటమి ప్రభుత్వం త్వరలోనే ఒక బలమైన కొత్త చట్టాన్ని తీసుకురాబోతోందని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
'ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘిస్తే చట్టపరమైన పరిణామాలు ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛను గౌరవిస్తూనే సామాజిక మాధ్యమాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.' అని పవన్ కళ్యాణ్ అన్నారు.
సోషల్ మీడియా వేధింపుల వల్ల ఇబ్బంది పడుతున్న బాధితులకు అండగా ఉండేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. అందుకోసం ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. బాధితులు తమకు జరిగిన అన్యాయంపై స్క్రీన్‌షాట్లు, వీడియో లింకులు వంటి డిజిటల్ ఆధారాలతో ఇక్కడ ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ ఫిర్యాదులను నిష్పక్షపాతంగా పరిశీలించి, తప్పు చేసిన వారిపై పోలీసు అధికారుల ద్వారా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
'తప్పు చేసిన వాడు ఏ కులం, మతం లేదా ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడైనా సరే.. చట్టం నుండి తప్పించుకోలేడు. నేరగాళ్లు ఏ జెండా వెనుక దాక్కున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు.' అని పవన్ కళ్యాణ్ గట్టిగా హెచ్చరించారు. ఆరోగ్యకరమైన విమర్శలు, సెటైర్లు, భిన్నాభిప్రాయాలను తాము ఎల్లప్పుడూ స్వాగతిస్తామని, కానీ విద్వేషాలు రగిల్చే వారిని మాత్రం వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఫేక్ అకౌంట్ల వివరాలను ప్రభుత్వానికి అందించి సైబర్ నేరాల నియంత్రణలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
Anand Sai

