Dailyhunt
Sourav Ganguly: దుమారం రేపుతున్న సౌరవ్ గంగూలీ కామెంట్స్- ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నటి స్వస్తిక-మీ సౌకర్యాలు అందరికి ఉండవంటూ!

Sourav Ganguly: దుమారం రేపుతున్న సౌరవ్ గంగూలీ కామెంట్స్- ఘాటుగా కౌంటర్ ఇచ్చిన నటి స్వస్తిక-మీ సౌకర్యాలు అందరికి ఉండవంటూ!

Actress Swastika Mukherjee Slams Sourav Ganguly: బెంగాలీ బుల్లితెర నటుడు రాహుల్ అరుణోదయ బెనర్జీ మరణం ఆ చిత్ర పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.

ఒడిశాలో 'భోలేబాబా పార్ కరేగా' సీరియల్ షూటింగ్ సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి ఆయన ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఘటనపై టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ స్పందిస్తూ.. "అసలు షూటింగ్ కోసమని నీటిలోకి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది?" అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీశాయి.

ప్రజా ప్రతినిధిగా బాధ్యత ఉండాలి: స్వస్తిక ముఖర్జీ

సౌరవ్ గంగూలీ వ్యాఖ్యలపై ప్రముఖ నటి స్వస్తిక ముఖర్జీ తీవ్రంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో స్వస్తిక ముఖర్జీ మాట్లాడుతూ.. "గంగూలీ లాంటి గొప్ప వ్యక్తి తన నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తున్నాయో గమనించుకోవాలి. ఆయన మాటలు ఎదుటివారి వృత్తిని కించపరిచేలా ఉన్నాయి. మీరు చేస్తున్న పనిని నేను తక్కువ చేసి మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుందో, ఆయన మాటలు కూడా అలాగే ఉన్నాయి" అని మండిపడ్డారు.

ఏసీ గదుల్లో ఉంటే గ్రౌండ్ రియాలిటీ తెలియదు

సినిమా లేదా సీరియల్ షూటింగ్ ఎలా జరుగుతుందో గంగూలీకి తెలియకపోవచ్చని స్వస్తిక ఎద్దేవా చేశారు. "సౌరవ్ గంగూలీ ఒక సెలబ్రిటీ. ఆయన ఏసీ గదుల్లో నాన్-ఫిక్షన్ షోలు చేస్తారు. ఆయనకు కావాల్సినవన్నీ అక్కడికక్కడే అందుతాయి. కానీ, షూటింగ్ గ్రౌండ్‌లో ఉండే పరిస్థితులు వేరు. ఒక ప్రాజెక్టులో రాహుల్ నీటిలోకి వెళ్లకపోతే, అతని స్థానంలో మరొకరిని పెట్టి అయినా ఆ సీన్ తీస్తారు. గంగూలీకి ఉన్న సౌకర్యాలు అందరు 'రాహుల్'లకు ఉండవు కదా!" అని స్వస్తికా ముఖర్జీ ఘాటుగా వ్యాఖ్యానించారు.

అసలేం జరిగింది?

మార్చి 29న ఒడిశాలోని దిఘా తీరంలో ఒక డ్యాన్స్ సీక్వెన్స్ చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మోకాళ్ల లోతు నీటిలో రాహుల్, మరో నటి శ్వేతా మిశ్రా డ్యాన్స్ చేస్తుండగా.. అకస్మాత్తుగా నీటి అడుగున ఉన్న గొయ్యిలో జారి పడిపోయారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించినప్పటికీ రాహుల్ ప్రాణాలు కాపాడలేకపోయారు.

ఈ ఘటనతో బెంగాలీ పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. షూటింగ్ లొకేషన్లలో నటీనటులు, సాంకేతిక నిపుణుల రక్షణ కోసం సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపిస్తూ ఏప్రిల్ 7 (మంగళవారం) నుంచి పరిశ్రమ అంతా నిరవధిక సమ్మెకు దిగింది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu