Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Southwest monsoon : బ్యాడ్​ న్యూస్ చెప్పిన ఐఎండీ- ఈ ఏడాది వర్షాలు.. అంచనాల కన్నా తక్కువే! కేరళని తాకేదెప్పుడు?

Southwest monsoon : బ్యాడ్​ న్యూస్ చెప్పిన ఐఎండీ- ఈ ఏడాది వర్షాలు.. అంచనాల కన్నా తక్కువే! కేరళని తాకేదెప్పుడు?

దేశంలో రాబోయే నైరుతి రుతుపవనాల వర్షపాతానికి సంబంధించి శుక్రవారం కీలక అప్‌డేట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ఈ ఏడాది దేశవ్యాప్తంగా కేవలం 90 శాతం కాలానుగుణ వర్షపాతం (ఎల్​పీఏ) నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

ఇది ఏప్రిల్‌లో అంచనా వేసిన 92 శాతం కంటే కూడా తక్కువ కావడం గమనార్హం. ఇప్పటికే ఎండలతో అల్లాడిపోతూ వర్షాల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఈ వార్త మరింత ఆందోళన కలిగిస్తోంది.

జూన్ నెలలో 'ఎల్ నినో' పరిస్థితులు ఏర్పడి, సీజన్ ద్వితీయార్థంలో అవి మరింత బలపడటమే తాజా అంచనాలకు ప్రధాన కారణమని ఐఎండీ స్పష్టం చేసింది. తక్కువ వర్షపాతం అంచనాలతో దేశ వ్యవసాయ రంగం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశం లేకపోలేదు.

పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడుతున్న బలహీనమైన ఎల్ నినో పరిస్థితుల కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా "సాధారణం కంటే తక్కువ" వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అధికారికంగా ప్రకటించింది.

నైరుతి రుతుపవనాల తాజా అంచనాలు, వాతావరణ పరిస్థితుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

1. ఏ ప్రాంతంలో ఎలాంటి వర్షాలు?

ఐఎండీ విడుదల చేసిన తాజా మ్యాపింగ్ ప్రకారం దేశంలోని వివిధ ప్రాంతాలలో వర్షపాతం ఇలా ఉండనుంది:

ఈశాన్య భారతం : ఇక్కడ సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

వాయువ్య, మధ్య, దక్షిణ భారతదేశం: ఈ ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయి.

వ్యవసాయంపై పడనున్న ప్రభావం : దేశంలోని మొత్తం సాగు భూమిలో 51 శాతం ప్రాంతం వర్షాలపైనే ఆధారపడి ఉంది. అలాగే దేశ జనాభాలో 47 శాతం మంది జీవనోపాధి కోసం వ్యవసాయాన్ని నమ్ముకున్నారు. 2023లో కూడా ఎల్ నినో కారణంగా 94% వర్షపాతమే నమోదైంది. ఇప్పుడు అంతకంటే తక్కువగా 90% మాత్రమే కురిసే అవకాశం ఉందని ఐఎండీ చెప్పడంతో ఆహార ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

2. కేరళలో రుతుపవనాల రాక ఆలస్యం..

సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు కేరళను తాకాల్సి ఉంటుంది. ఈ ఏడాది మే 26నే ప్రారంభమవుతాయని గతంలో అంచనా వేసినప్పటికీ, తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం రుతుపవనాల రాక మరింత ఆలస్యం కానుంది.

పొడి వాతావరణం: మే 28 నుంచి జూన్ 4 వరకు కేరళ అంతటా పొడి వాతావరణం ఉంటుందని, జూన్ 4 నుంచి 11 మధ్య వాతావరణంలో స్వల్ప మార్పులు రావొచ్చని ఐఎండీ తెలిపింది. జూన్ 11 తర్వాతే వర్షాలు పుంజుకునే అవకాశం ఉంది.

ఆలస్యానికి గల కారణాలు: 1. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఒక తీవ్రమైన టైఫూన్ ఏర్పడుతోంది. ఇది అరేబియా సముద్రం, బంగాళాఖాతం నుంచి తేమను తన వైపుకు లాగేసుకుంటోంది.

2. లక్షద్వీప్ ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కేరళ భూభాగంపై ఆశించిన స్థాయిలో మేఘాలు దట్టంగా కమ్మడం లేదు.

3. రుతుపవనాల ప్రకటనకు ఐఎండీ నిబంధనలు..

కేరళలో నైరుతి రుతుపవనాలు అధికారికంగా ప్రవేశించాయని ప్రకటించడానికి ఐఎండీ కొన్ని ఖచ్చితమైన పారామీటర్లను లెక్కిస్తుంది. అవి..

మే 10 తర్వాత.. నిర్దేశించిన 14 వాతావరణ కేంద్రాల్లో (మినికోయ్, తిరువనంతపురం, కొచ్చి, మంగళూరు తదితర ప్రాంతాలు) కనీసం 60 శాతం కేంద్రాలలో వరుసగా రెండు రోజుల పాటు 2.5 ఎంఎం లేదా అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదు కావాలి. ఈ ఏడాది ఇప్పటికీ ఇది జరగలేదు.

దానితో పాటు పశ్చిమ గాలుల తీవ్రత, ఆకాశం పూర్తిగా మేఘావృతమై ఉండటం తప్పనిసరి.

ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రంలోని కొన్ని భాగాలు, లక్షద్వీప్, అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని, రాబోయే రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు నెమ్మదిగా ముందుకు సాగుతాయని ఐఎండీ పేర్కొంది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu