Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Southwest Monsoon : హమ్మయ్య! ఎట్టకేలకు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..

Southwest Monsoon : హమ్మయ్య! ఎట్టకేలకు కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..

వేసవితో ఇన్ని నెలలు ఎండలతో అల్లాడిపోయిన దేశవ్యాప్తంగా కోట్ల మంది ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభవార్త వచ్చేసింది! నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు దేశంలోకి ప్రవేశించాయి.

గురువారం నాడు రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. అయితే, సాధారణంగా వచ్చే తేదీతో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాక మూడు రోజులు ఆలస్యమైంది.

అంతేకాదు, ముందుగా వాతావరణ శాఖ అంచనా వేసిన దానికంటే కూడా ఈ ప్రక్రియ కొద్దిగా నెమ్మదించింది. గత మే 15న ఐఎండీ ఇచ్చిన ముందస్తు అంచనా ప్రకారం.. మే 26 నాటికే (నాలుగు రోజులు అటు ఇటుగా) రుతుపవనాలు కేరళకు వస్తాయని భావించారు. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన కొన్ని వాతావరణ మార్పుల వల్ల ఈ ఆలస్యం తప్పలేదు. కేరళ తీరాన్ని తాకిన తర్వాత రుతుపవనాలు క్రమంగా ఉత్తర దిశగా విస్తరిస్తాయి. జులై మధ్య నాటికి దేశంలోని మెజారిటీ ప్రాంతాలకు ఇవి విస్తరిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఆలస్యానికి గల కారణాలు ఏంటి?

రుతుపవనాల రాక ఆలస్యం కావడానికి వాతావరణ నిపుణులు కొన్ని బలమైన కారణాలను విశ్లేషించారు. పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక టైఫూన్ (తీవ్ర తుపాను) కారణంగా అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని తేమను అది తనవైపు లాగేసుకుంది. దీనికి తోడు లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కూడా రుతుపవనాల కదలికలను నెమ్మదింపజేసింది. ఈ రెండు కారణాల వల్ల రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించడానికి అవసరమైన బలాన్ని తొలిదశలో అందుకోలేకపోయాయి.

ఆంధ్ర, తెలంగాణలోకి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?

భారీ వర్షాల హెచ్చరిక..

రుతుపవనాల ఆగమనంతో అరేబియా సముద్రం, బంగాళాఖాతం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు పరిసర ప్రాంతాల్లో వాతావరణం అనుకూలంగా మారిందని ఐఎండీ స్పష్టం చేసింది. రాబోయే కొద్ది రోజుల పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి చాలా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు వాయువ్య, మధ్య, తూర్పు, దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన ఉరుములు, మెరుపులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రుతుపవనాలు మొదట కేరళకే ఎందుకు వస్తాయి?

భారతదేశ నైరుతి తీరంలో కేరళ భౌగోళికంగా ఉన్న స్థానమే దీనికి ప్రధాన కారణం! హిందూ మహాసముద్రంపై పుట్టే తేమతో కూడిన గాలులు వాయువ్య దిశగా ప్రయాణిస్తూ, అరేబియా సముద్రం మీదుగా దేశం వైపు దూసుకొస్తాయి. ఈ క్రమంలో భారత ప్రధాన భూభాగంలో వీటికి మొదట ఎదురయ్యే ప్రాంతం కేరళ తీరమే.

ఈ గాలులు కేరళ తీరానికి చేరుకోగానే, అక్కడ తీరానికి సమాంతరంగా విస్తరించి ఉన్న పశ్చిమ కనుమలు (వెస్ట్రన్ ఘాట్స్) ఒక పెద్ద గోడలా అడ్డుపడతాయి. ఈ పర్వత శ్రేణులు రుతుపవన గాలులను పైకి లేచేలా బలవంతం చేస్తాయి. గాలులు పైకి లేచే కొద్దీ అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గి, గాలి చల్లబడుతుంది. దీనినే శాస్త్రీయంగా 'అడియాబాటిక్ కూలింగ్' అంటారు. ఈ ప్రక్రియ వల్ల గాలిలోని నీటి ఆవిరి ఘనీభవించి దట్టమైన మేఘాలుగా మారుతుంది. ఫలితంగా కేరళలో భారీ వర్షాలు కురుస్తాయి.

భారతదేశానికి రుతుపవనాలు ఎందుకు అంత ముఖ్యం?

భారతదేశంలో ఏడాది పొడవునా కురిసే మొత్తం వర్షపాతంలో దాదాపు 80 శాతం వాటా ఈ నైరుతి రుతుపవనాలదే. దేశంలోని మెజారిటీ వ్యవసాయ భూములకు నేటికీ ఎటువంటి సాగునీటి వసతి లేదు. ఆ భూములన్నీ కేవలం వర్షం పైనే ఆధారపడి ఉన్నాయి.

రుతుపవనాలు సకాలంలో వచ్చి, తగినంత వర్షం పడితేనే దేశంలో ఖరీఫ్ (వేసవి) సీజన్ సాగు సజావుగా సాగుతుంది. వరి, పప్పుధాన్యాలు, చెరకు వంటి కీలకమైన పంటల సాగుకు ఈ నీరే కీలకం. పంటలు బాగా పండితే దేశంలో ఆహార భద్రత ఏర్పడటమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లోని కోట్ల మంది రైతు కుటుంబాల ఆదాయం పెరుగుతుంది.

వ్యవసాయానికే కాకుండా, దేశంలోని ప్రధాన జలాశయాలు (డ్యాములు), ప్రాజెక్టులు నిండాలన్నా ఈ వర్షాలు పడాల్సిందే. ఈ నీటిని వేసవిలో తాగునీటి అవసరాలకు, అలాగే జలవిద్యుత్ (హైడ్రోఎలక్ట్రిక్ పవర్) ఉత్పత్తికి ఉపయోగిస్తారు. పంటల దిగుబడి బాగున్నప్పుడు మార్కెట్​లో ఆహార పదార్థాల ధరలు అదుపులో ఉంటాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచుతుంది. తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ము ముందుకు సాగుతుంది. అందుకే, నైరుతి రుతుపవనాలను భారత దేశ భాగ్యరేఖగా పరిగణిస్తారు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu