Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Study in US : అమెరికాలో ఉచితంగా చదువుకునే గోల్డెన్ ఛాన్స్! ఈ టాప్ యూనివర్సిటీల్లో..

Study in US : అమెరికాలో ఉచితంగా చదువుకునే గోల్డెన్ ఛాన్స్! ఈ టాప్ యూనివర్సిటీల్లో..

US Top Universities scholarships : విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనేది భారత్‌కు చెందిన లక్షలాది మంది విద్యార్థుల కల. అయితే అక్కడి ట్యూషన్ ఫీజులు, హాస్టల్ ఖర్చులు, పుస్తకాలు, ప్రయాణ ఖర్చుల భారం చూసి చాలా మంది వెనకడుగు వేస్తుంటారు.

కానీ భారతీయ విద్యార్థుల కలలను సాకారం చేసేందుకు అమెరికాలోని పలు ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు భారీ ఆర్థిక సహాయాన్ని, స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నాయి. క్యూఎస్ వరల్డ్ ర్యాంకింగ్స్ 2026లో టాప్ పొజిషన్లలో నిలిచిన హార్వర్డ్, ఎంఐటీ, యేల్ వంటి వర్సిటీలు అర్హులైన అంతర్జాతీయ విద్యార్థులకు 100% ఉచిత విద్యను అందిస్తున్నాయి. ఈ వర్సిటీల ఫైనాన్షియల్ ఎయిడ్ వివరాలు ఇక్కడ తెలుసుకోండి..

విద్యార్థులు ముందస్తుగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఈ కింది టాప్ ఐదు వర్సిటీలలో ఉచితంగా చదువుకునే అవకాశాన్ని పొందవచ్చు.

1. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)

ప్రపంచంలోనే నంబర్ వన్ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఎంఐటీ, అంతర్జాతీయ విద్యార్థుల కుటుంబ నేపథ్యం ఆధారంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.

రూ. 95 లక్షలలోపు ఆదాయం ఉంటే ఫ్రీ: ఏ విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం అయితే 100,000 డాలర్ల (సుమారు రూ. 95.5 లక్షలు) కంటే తక్కువగా ఉంటుందో, ఆ విద్యార్థి తల్లిదండ్రులు వర్సిటీకి రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు.

2024-25 విద్యాసంవత్సరంలో దాదాపు 39.47 శాతం మంది ఎంఐటీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు వారి ట్యూషన్ ఫీజు కంటే ఎక్కువ మొత్తాన్ని స్కాలర్‌షిప్‌లు, గ్రాంట్ల రూపంలో ఉచితంగా పొందారు.

2. యేల్ యూనివర్సిటీ..

యేల్ యూనివర్సిటీ అడ్మిషన్ల ప్రక్రియలో ఒక అద్భుతమైన విధానాన్ని అవలంబిస్తుంది.

100శాతం ఫైనాన్షియల్ ఎయిడ్: అడ్మిషన్ ఇచ్చేటప్పుడు విద్యార్థి ఫీజు కట్టగలడా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే సీటు కేటాయిస్తారు.

సీటు వచ్చాక, సదరు విద్యార్థి కుటుంబ ఆర్థిక అవసరాన్ని బట్టి 100 శాతం ఆర్థిక సహాయాన్ని వర్సిటీనే అందిస్తుంది. దీనికోసం అప్లికేషన్ సమయంలోనే మూడు రకాల ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

3. హార్వర్డ్ యూనివర్సిటీ..

"మీ కుటుంబం ఎంతవరకు భరించగలదో.. హార్వర్డ్ అంతవరకే వసూలు చేస్తుంది," అని ఈ ప్రతిష్టాత్మక వర్సిటీ అధికారికంగా ప్రకటించింది.

ఉచిత విద్య అర్హత: ఇక్కడ కూడా 100,000 డాలర్ల (సుమారు రూ. 95.5 లక్షలు) లేదా అంతకంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లలకు చదువు పూర్తిగా ఉచితం.

ఏవేవి ఉచితం?: ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ కింద ట్యూషన్ ఫీజు, హాస్టల్ వసతి, భోజనం, హెల్త్ ఇన్సూరెన్స్, ఇంటి నుంచి క్యాంపస్‌కు వెళ్లే ప్రయాణ ఖర్చులు కూడా వర్సిటీనే భరిస్తుంది.

అదనంగా, మొదటి సంవత్సరంలో విద్యార్థి అవసరాల కోసం 2,000 డాలర్ల (సుమారు రూ. 1.9 లక్షలు) స్టార్ట్-అప్ గ్రాంట్, జూనియర్ ఇయర్‌లో పోస్ట్-హార్వర్డ్ లైఫ్ ప్లానింగ్ కోసం మరో 2,000 డాలర్ల లాంచ్ గ్రాంట్ ఇస్తారు. ఒకవేళ కుటుంబ ఆదాయం 200,000 డాలర్ల లోపు ఉంటే కేవలం ట్యూషన్ ఫీజు పూర్తిగా మాఫీ అవుతుంది.

4. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ..

స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్థుల కోసం పరిమిత సంఖ్యలో ఫైనాన్షియల్ ఎయిడ్ నిధులు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి, అక్కడ అడ్మిషన్ కోసం అప్లై చేసే సమయంలోనే అప్లికేషన్ ఫామ్‌లో 'ఆర్థిక సహాయం కావాలి' అనే ఆప్షన్‌ను ఖచ్చితంగా ఎంచుకోవాలి. అడ్మిషన్ పొందిన విద్యార్థుల కుటుంబ పరిస్థితుల ఆధారంగా ఇన్​స్టిట్యూషనల్ ఫండ్స్ నుంచి సహాయం లభిస్తుంది.

అమెరికాలో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయాల అడ్మిషన్ నోటిఫికేషన్లను గమనిస్తూ, ఫైనాన్షియల్ ఎయిడ్ దరఖాస్తులను ముందే సబ్మిట్ చేయడం ద్వారా ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.

5. కొలంబియా యూనివర్సిటీ..

కొలంబియా యూనివర్సిటీ అంతర్జాతీయ విద్యార్థుల అడ్మిషన్లను 'నీడ్-అవేర్' పద్ధతిలో పరిశీలిస్తుంది.

మీరు సమర్పించిన ఫైనాన్షియల్ అప్లికేషన్ ఆధారంగా, మీ కుటుంబానికి ఉన్న ఆర్థిక అవసరాన్ని ఈ వర్సిటీ 100 శాతం తీరుస్తుంది.

ఇక్కడ చదువుకునే అంతర్జాతీయ విద్యార్థులకు లభించే సగటు ఆర్థిక సహాయం 79,375 డాలర్లు (సుమారు రూ. 75.8 లక్షలు)!

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu