Dailyhunt
Suryakumar Yadav: ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా స్టెప్పులతో అదరగొట్టిన సూర్యకుమార్.. వీడియో వైరల్

Suryakumar Yadav: ధురంధర్‌లో అక్షయ్ ఖన్నా స్టెప్పులతో అదరగొట్టిన సూర్యకుమార్.. వీడియో వైరల్

పీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టు జోరు కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)పై ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో ఉన్న ముంబై జట్టు..

శనివారం (ఏప్రిల్ 4) ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జరగనున్న పోరుకు సిద్ధమవుతోంది. అయితే మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ ముంబై ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. ముఖ్యంగా మిస్టర్ 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్.. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ 'ధురంధర్' (Dhurandhar)లోని అక్షయ్ ఖన్నా వైరల్ స్టెప్పును రీక్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.

ఇది దాదా స్టైల్.. ఫుల్ 'ధురంధర్' మోడ్

ముంబై ఇండియన్స్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన వీడియోలో సూర్యకుమార్ యాదవ్ తనలోని డ్యాన్సర్‌ను బయటకు తీశారు. "ఇది దాదా స్టైల్.. ఫుల్ ధురంధర్ మోడ్" అంటూ పోస్ట్ చేసిన ఈ వీడియోలో.. ఫ్లిప్పరాచీకి చెందిన 'FA9LA' సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో ప్లే అవుతుండగా సూర్య స్టేజ్ మీదకు వచ్చాడు. రాగానే అక్షయ్ ఖన్నా మేనరిజంను అనుకరిస్తూ అదిరిపోయే స్టెప్పులు వేశాడు. అక్కడున్న వారంతా కేరింతలు కొట్టడంతో సూర్య కాసేపు ఆగి మళ్లీ డ్యాన్స్ చేయకుండా తనను తాను ఆపుకోలేకపోయాడు.

దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన 'ధురంధర్' సినిమాలంటే సూర్యకు ఎంత ఇష్టమో ఇదివరకే వెల్లడైంది. ఇటీవల ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ, జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్న సమయంలో సూర్య సరదాగా బుమ్రాను ఆటపట్టించాడు. "ఘర్ కీ యాద్ నహీ ఆయీ, జస్సీ?" (నీకు ఇల్లు గుర్తుకు రాలేదా జస్సీ?) అంటూ 'ధురంధర్: ది రివెంజ్'లో రణవీర్ సింగ్‌కు ఒక పాత్ర చెప్పే డైలాగ్‌ను కొట్టాడు. బుమ్రా భార్య, స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేశన్ కూడా ఇటీవల ఇదే డైలాగ్‌ను ఆయనతో అనడంతో అందరూ నవ్వుల్లో మునిగిపోయారు.

బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్' ప్రభంజనం

ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణంతో రూపొందిన 'ధురంధర్' సినిమాలు భారతీయ సినిమా రికార్డులను తిరగరాస్తున్నాయి. పాకిస్థాన్‌లోని లియారీలో బలోచ్ గ్యాంగ్‌లోకి చొరబడిన ఇండియన్ స్పై జస్కిరాత్ సింగ్ రంగీ అలియాస్ హమ్జా అలీ మజారీ (రణవీర్) కథను ఈ సినిమాలు చూపిస్తున్నాయి.

2025 డిసెంబర్‌లో విడుదలైన మొదటి భాగం రూ. 1300 కోట్లు వసూలు చేయగా, మార్చి 19న విడుదలైన 'ధురంధర్ 2' కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 1500 కోట్ల మైలురాయిని దాటేసింది. ఈ సినిమాపై కొన్ని విమర్శలు, 'ప్రోపగాండా' అనే ఆరోపణలు వచ్చినప్పటికీ, ప్రేక్షకులు మాత్రం బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రస్తుతం ఇది ఆమిర్ ఖాన్ 'దంగల్' తర్వాత రెండో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ చిత్రంగా నిలిచింది. ఓవరాల్ ఇండియాలో దంగల్, పుష్ప 2, బాహుబలి 2 తర్వాత నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఈ రన్ ముగిసేలోపు ఇది అగ్రస్థానానికి చేరుకుంటుందో లేదో చూడాలి.

Hari Prasad S, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu