ఆంధ్రప్రదేశ్‌లోని స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సచివాలయ వ్యవస్థలో ఆరేళ్ల సర్వీస్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఉద్యోగులకు 'ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్' (AAS) వర్తింపజేయాలని ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ నిర్ణయం మేరకు 6 సంవత్సరాల సర్వీసును పూర్తి చేసుకున్న సచివాలయ సిబ్బందికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ మంజూరు చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. 11వ వేతన సవరణ సంఘం (11th PRC) నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ విధివిధానాలను అమలు చేయనున్నారు. ఈ మేరకు స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ విభాగ కార్యదర్శి భాస్కర్ ఐఏఎస్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పదోన్నతి అవకాశాలు త్వరగా రాని ఉద్యోగులకు ఆర్ధికంగా ఊరట కలిగించేందుకు ఈ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను అమల్లోకి తెచ్చారు. ఒకే కేడర్‌లో నిర్దిష్ట కాలం (6, 12, 18, 24 ఏళ్లు) సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులకు తదుపరి స్కేల్‌ను మంజూరు చేస్తారు. 6 ఏళ్లు పూర్తయిన సచివాలయ సిబ్బందికి స్పెషల్ గ్రేడ్ పోస్ట్ స్కేల్ రావడం వల్ల వారి ప్రాథమిక వేతనం పెరిగి, ప్రతినెల చేతికి వచ్చే వేతనం పెరుగుతుంది.
సచివాలయ ఉద్యోగులుగా చేరి ఆరేళ్లు పూర్తయినా ప్రమోషన్లు లభించని వారికి ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసాతో పాటు ఉద్యోగంలో మెరుగైన ప్రోత్సాహం లభిస్తుంది. పెరిగిన స్కేల్‌తో పాటు డీఏ, హెచ్‌ఆర్‌ఏ అలవెన్సుల రూపంలో కూడా ఉద్యోగులకు అదనపు లబ్ధి చేకూరుతుంది.
సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని, 11వ పీఆర్‌సీ నిబంధనల ప్రకారం 6 ఏళ్ల సర్వీసును పరిగణించి ఎఏఎస్ అమలు చేయడంపై సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, సిబ్బంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల వేలాది మంది గ్రామీణ, పట్టణ సచివాలయ ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది.
Anand Sai

