Dailyhunt
Tamil Nadu Election Results 2026 : ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం - డీఎంకే మంత్రి ఓటమి...!

Tamil Nadu Election Results 2026 : ఒకే ఒక్క ఓటుతో టీవీకే అభ్యర్థి సంచలన విజయం - డీఎంకే మంత్రి ఓటమి...!

TVK Victory Tiruppattur : తమిళనాడు రాజకీయ యవనికపై కొత్తగా ఉదయించిన దళపతి విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (TVK) తిరుగులేని విజయాన్ని అందుకుంది.

తొలిసారిగా ఎదుర్కొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటి… తమిళనాట సరికొత్త చరిత్రకు పురుడు పోసింది.

రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రవిడ దిగ్గజాలకు విజయ్ నేతృత్వంలోని టీవీకె కోలుకోలేని షాక్ ఇచ్చింది.అయితే ఈ ఎన్నికల్లో ఆసక్తికరమైన విజయం నమోదైంది. కేవలం ఒకే ఒక్క ఓటుతో తిరుపత్తూరు నియోజకవర్గంలో టీవీకే జెండా ఎగిరిగింది. కౌంటింగ్ కేంద్రంలో నిమిష నిమిషానికి మారిన సమీకరణాలు… ఉత్కంఠ భరితంగా సాగిన ఓట్ల లెక్కింపు చివరకు డీఎంకే మంత్రికి ఊహించని ఓటమిన మిగిల్చింది.

ఒకే ఒక్క ఓటు….

ఈ ఎన్నికల్లో సహకార శాఖ మంత్రి కేఆర్ పెరియకరుప్పన్ డీఎంకే అభ్యర్థిగా తిరుపత్తూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. టీవీకే నుంచి శీనివాస సేతుపతి బరిలో నిలవగా…. వీరి మధ్య ఎన్నికల పోరు పోరు నువ్వా-నేనా అన్నట్టు సాగింది. తుది రౌండ్ వరకు ఇద్దరి మధ్య ఆధిక్యం దోబూచులాడింది. చివరకు ఫలితం వెలువడే సమయానికి టీవీకే అభ్యర్థి కేవలం ఒక్క ఓటు ఆధిక్యంతో విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ వార్త వినగానే కౌంటింగ్ కేంద్రం వెలుపల ఉన్న టీవీకే కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోగా…. డీఎంకే శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యాయి.

అత్యల్ప మెజారిటీ రావడంతో డీఎంకే మంత్రి తరపున ఏజెంట్లు రీకౌంటింగ్ కావాలని పట్టుబట్టారు. దీంతో గంటల తరబడి అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం రీకౌంటింగ్ నిర్వహించినప్పటికీ, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. ఆ ఒక్క ఓటు డీఎంకే మంత్రి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద దెబ్బే కొట్టింది. "ప్రజా తీర్పును మేం గౌరవిస్తాం, కానీ ఇంత స్వల్ప తేడాతో ఓడిపోవడం జీర్ణించుకోలేకపోతున్నాం" అని డీఎంకే సీనియర్ నాయకుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.

పెరియకరుప్పన్ కు మొత్తం 83,374 ఓట్లు పోలయ్యాయి. ఇక టీవీకే అభ్యర్థి ఆర్ శీనివాస సేతుపతి 83,375 ఓట్లు పడ్డాయి. ఒకే ఒక్క ఓటు తేడాతో శీనివాస సేతుపతి విక్టరీ అందుకున్నారు. ఈ నియోజకవర్గం డీఏంకే పార్టీకి కంచుకోట లాంటిది. డీఎంకే అభ్యర్థిగా పెరియకరుప్పన్ 2006, 2011, 2016, 2021 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధిస్తూ వచ్చారు. ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏఐఏడీఎంకే పోటీ చేయలేదు. బీజేపీకి ఈ సీటును కేటాయించింది. బీజేపీ నుంచి కేసీ తిరుమారన్ బరిలో నిలవగా….. టీవీకే తరఫున శీనివాస సేతుపతి పోటీ చేశారు. పెరియకరుప్పన్ ఓక్క ఓటు తేడాతో ఓడిపోగా.. తిరుమారన్ కు మూడో స్థానం దక్కింది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu