ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా లెఫ్ట్ (వామపక్ష) విద్యార్థి సంఘాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
విద్యార్థుల హక్కులు, విద్యావ్యవస్థ బలోపేతం కోసం జులై 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. తమ డిమాండ్ల సాధన కోసం విద్యాసంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ బంద్‌కు సహకరించాలని కోరాయి.
ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కల్పన, అందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ఈ బంద్ నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సంఘాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (PDSU) సంయుక్తంగా ఈ రాష్ట్రవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చాయి.
విద్యార్థి సంఘాల ప్రధాన డిమాండ్లు ఇవే
ప్రభుత్వ విద్యాసంస్థల మనుగడను కాపాడేందుకు ఈ కింది ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నట్లు లెఫ్ట్ సంఘాలు స్పష్టం చేశాయి.
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న అన్ని రకాల టీచింగ్(బోధన), నాన్-టీచింగ్ (బోధనేతర) పోస్టులను తక్షణమే భర్తీ చేయాలి.
ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఇష్టారాజ్యంగా పెంచేస్తున్న ఫీజులను అరికట్టేందుకు ప్రభుత్వం కఠినమైన నిబంధనలు, చట్టాలను తీసుకురావాలి.
ప్రభుత్వ బడులు, కాలేజీలలో తాగునీరు, మరుగుదొడ్లు, బెంచీలు, ల్యాబ్‌లు వంటి కనీస ప్రాథమిక సదుపాయాలను కల్పించి వాటిని బలోపేతం చేయాలి.
ప్రభుత్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం కాకుండా కాపాడుకోవడానికి, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి ఈ బంద్ ఎంతో అవసరమని వామపక్ష విద్యార్థి సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. విద్యాసంస్థల మూసివేత ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి, విద్యార్థుల సమస్యలను పరిష్కరించుకుంటామని వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేశారు.
Anand Sai

