తెలంగాణలో కొత్త కారు లేదా బైక్ కొన్నవారు ఇటీవలి కాలంలో రిజిస్ట్రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం చూడవచ్చు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కోసం ఎదురుచూసేవారు చాలా మందే ఉన్నారు.
అయితే ఇలా మీరు ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఉంది. అసలు విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లో వేలాది మంది వాహనదారులు ప్రస్తుతం ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వాహన్(VAHAN) పోర్టల్‌లో సాంకేతిక మార్పుల వల్ల ఈ ఆలస్యం జరుగుతోంది.
షోరూమ్ వారు అదే రోజే రిజిస్ట్రేషన్ అవుతుందని చెప్పినా, వారం దాటినా నంబర్ రాకపోవడంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. టెంపరరీ రిజిస్ట్రేషన్ (TR) గడువు ముగిసిపోతుండటంతో బయటకు వాహనం తీయాలంటే భయపడాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కొందరు.
మార్చి 23, 2026 నుంచి తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి 'వాహన్ 4.0' పోర్టల్‌లోకి మారింది. అంతకుముందు వరకు రాష్ట్రానికి సొంత సాఫ్ట్‌వేర్ ఉండేది. దేశవ్యాప్తంగా ఒకే రకమైన నిబంధనలు, ఇతర రాష్ట్రాలకు వాహనాల బదిలీ సులభతరం చేయడం వంటి లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. అయితే పాత వ్యవస్థ నుంచి కొత్త వ్యవస్థలోకి మారుతున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తలెత్తాయి. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.
ఆలస్యానికి ప్రధాన కారణాలు
ఆలస్యానికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయ్. పాత డేటాను కొత్త సెంట్రల్ సర్వర్‌లోకి మార్చేటప్పుడు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. డీలర్లు మరియు ఆర్టీఏ (RTA) సిబ్బందికి ఈ కొత్త సాఫ్ట్‌వేర్‌పై పూర్తి అవగాహన రావడానికి సమయం పడుతోంది. వాహనాల ఫోటోలు, నంబర్ ప్లేట్లు వంటి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంలో జాప్యం జరుగుతోంది. రాష్ట్రంలో వాహనాల అమ్మకాలు ఎక్కువగా ఉండటంతో ఒక్కసారిగా వచ్చిన దరఖాస్తులను ప్రాసెస్ చేయడం వ్యవస్థకు భారంగా మారింది.
మారుతున్న పరిస్థితి
ఈ సమస్యలు తాత్కాలికమేనని ఉన్నతాధికారులు తెలిపారు. మే చివర నాటికి పరిస్థితిలో మార్పు కనిపిస్తుందంటున్నారు. ఇప్పటికే 75,000 పైగా టెంపరరీ రిజిస్ట్రేషన్లు, 41,000 పైగా పర్మనెంట్ రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక సాంకేతిక బృందం (NIC) ఈ సమస్యలను పరిష్కరిస్తోంది. రాబోయే 15 నుంచి 30 రోజుల్లో అంతా సవ్యంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.
వాహనదారులకు అలర్ట్
ఒకవేళ మీ టీఆర్ (TR) గడువు ముగిసిపోతుంటే వెంటనే మీ వాహన డీలర్‌ను సంప్రదించి స్టేటస్ అడగండి. హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు బిగించారా లేదా అని చూసుకోండి. అన్ని పత్రాలు సక్రమంగా అప్‌లోడ్ అయ్యేలా చూడండి. మీ నంబర్ స్టేటస్ తెలుసుకోవడానికి Parivahan పోర్టల్‌ను లేదా తెలంగాణ రవాణా శాఖ వెబ్‌సైట్‌ను తనిఖీ చేయండి.
వాహన్ పోర్టల్‌లో వచ్చే సమస్యలు తాత్కాలికమేనని అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో అనేక సమస్యలు దీనిద్వారా తీరుతాయని చెబుతున్నారు. అవినీతి తగ్గుతుందని, వాహనాల అమ్మకాలు, బదిలీలు భవిష్యత్తులో చాలా సులభం అవుతాయని అంటున్నారు.
Anand Sai

