Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana ACB : ఏసీబీ వలలో మైనింగ్ శాఖ ఏడీ జయరాజు - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు!

Telangana ACB : ఏసీబీ వలలో మైనింగ్ శాఖ ఏడీ జయరాజు - కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుర్తింపు!

వినీతి అధికారుల గుండెల్లో తెలంగాణ ఏసీబీ రైళ్లు పరిగెత్తిస్తోంది. తాజాగా మరొక భారీ అక్రమాస్తుల తిమింగలాన్ని పట్టుకుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనులు, భూగర్భ వనరుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉంటూ, ప్రస్తుతం వరంగల్ జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు (FAC) నిర్వహిస్తున్న బొజ్జా జయరాజుపై ఏసీబీ వరంగల్ రేంజ్ అధికారులు విరుచుకుపడ్డారు.

తన సర్వీసు కాలంలో అక్రమ మార్గాల్లో, అవినీతికి పాల్పడి రాబడికి మించిన ఆస్తులను కూడబెట్టారనే పక్కా సమాచారంతో అధికారులు కేసు నమోదు చేశారు.

2026 ఆగస్టు 27న జయరాజు, ఆయన బంధువులు, ముఖ్య అనుచరులకు చెందిన 8 వేర్వేరు ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. 1988 అవినీతి నిరోధక చట్టం (2018 సవరణ) ప్రకారం ఈ సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

భారీగా ఆస్తులు…..

ఈ సోదాల్లో ఏసీబీ అధికారులకు కీలక పత్రాలు దొరికాయి. జయరాజు సంపాదించిన ఆస్తుల సర్కారు విలువ రూ.3,06,53,177 (మూడు కోట్ల ఆరు లక్షల యాభై మూడు వేల నూట డెబ్బై ఏడు రూపాయలు)గా తేలింది. అయితే బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం… సుమారు రూ.100 కోట్లకుపైగా విలువ చేసే ఆస్తులుగా అంచనా వేస్తున్నారు.

  • హైదరాబాద్ బోడుప్పల్‌లో రూ.40 లక్షల విలువైన జి+2 (G+2) భవనం.
  • హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో రూ.32.81 లక్షల విలువైన ప్లాట్.
  • కీసరలో రెండు, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం 5 ఓపెన్ ప్లాట్లు (విలువ రూ.15.77 లక్షలు).
  • 3.21 ఎకరాల వ్యవసాయ భూమి (విలువ రూ.8 లక్షలు).
  • రూ.10,03,640 నగదుతో పాటు ఎల్‌ఐసీ, మాక్స్ లైఫ్‌లలో రూ.19,86,104 పొదుపు సొమ్ము.
  • రూ.40 లక్షల విలువైన మూడు నాలుగు చక్రాల వాహనాలు (కార్లు), రెండు ద్విచక్ర వాహనాలు.
  • 629 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ రూ.37.23 లక్షలు), పోస్టాఫీసులో రూ.20.86 లక్షలు, మూడ బ్యాంక్ ఖాతాల్లో రూ.71.27 లక్షల నిల్వలు.
  • రూ.10.67 లక్షల విలువైన గృహోపకరణాలు.

విచారణలో మరో షాకింగ్ నిజం బయటపడింది. జయరాజు తన డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్, బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలించగా అక్రమ లావాదేవీల కోణం వెలుగులోకి వచ్చింది. ఇసుక రవాణాదారులు, వ్యాపారుల నుంచి లంచాల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.24.80 లక్షల నగదును డ్రైవర్ బ్యాంక్ ఖాతా నుంచి జయరాజు కుమార్తె బ్యాంక్ ఖాతాకు మళ్లించినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. లంచం సొమ్మునే ఈ విధంగా డిజిటల్ మార్గంలో బదిలీ చేశారని డ్రైవర్ కూడా అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.ఈ అక్రమ లావాదేవీలపై ఏసీబీ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా టోల్ ఫ్రీ నంబర్ 1064 ద్వారా గానీ, లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గానీ ఏసీబీని సంప్రదించాలని అధికారులు కోరారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu