Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు - ఇదే చివరి అవకాశం!

Telangana Inter Admissions 2026 : ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పొడిగింపు - ఇదే చివరి అవకాశం!

Telangana Inter Admissions 2026 : తెలంగాణలో ఇంటర్ ప్రవేశాల కోసం చూస్తున్న విద్యార్థులకు ఇంటర్మీడియట్ బోర్డు మరో అప్డేట్ ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు ఉద్దేశించిన ప్రవేశాల గడువును ఈనెల 7 వరకు పొడిగించింది.

అడ్మిషన్ల ప్రక్రియకు ఇదే చివరి అవకాశమని, దీని తర్వాత మరే కారణం చేతనైనా గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ప్రైవేట్ అన్‌ఎయిడెడ్, ఎయిడెడ్ కళాశాలలతో పాటు సాంఘిక, గిరిజన, మైనారిటీ సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలు, తెలంగాణ మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ) అన్నింటికీ ఈ విస్తరించిన గడువు వర్తిస్తుంది. విద్యార్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా, వీలైనంత త్వరగా తమకు నచ్చిన, అర్హత ఉన్న కళాశాలల్లో సీటును ఖరారు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

అడ్మిషన్ల ప్రక్రియలో కీలక నిబంధనలు

ఇంటర్మీడియట్ ప్రవేశాల నిర్వహణలో కళాశాల యాజమాన్యాలు పక్కాగా పాటించాల్సిన కొన్ని కీలక మార్గదర్శకాలను బోర్డు జారీ చేసింది.

  • ఇంటర్ అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రత్యేక ప్రవేశ పరీక్షలు నిర్వహించకూడదని బోర్డు స్పష్టం చేసింది. పదో తరగతిలో సాధించిన మార్కులు లేదా జీపీఏ మెరిట్ ఆధారంగానే సీట్లు కేటాయించాలి.
  • ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వర్గాల వారీగా రిజర్వేషన్ పద్ధతిని కచ్చితంగా అమలు చేయాలి.
  • అడ్మిషన్ పొందే ప్రతి విద్యార్థి తమ ఆధార్ కార్డును సమర్పించడంతో పాటు, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని తెలిపే యాంటీ డ్రగ్ డిక్లరేషన్ పత్రంపై సంతకం చేయడం తప్పనిసరి చేశారు.
  • ప్రైవేట్ కళాశాలల్లో తరగతి గదుల రద్దీని అరికట్టేందుకు ఒక సెక్షన్‌కు గరిష్ఠంగా 88 మంది విద్యార్థులను మాత్రమే చేర్చుకోవడానికి బోర్డు అనుమతించింది.

అడ్మిషన్లు తీసుకునే ముందు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర జాగ్రత్తలు వహించాలని ఇంటర్ బోర్డు సూచించింది. బోర్డు అధికారిక గుర్తింపు పొందిన కళాశాలల జాబితాను ముందుగా పరిశీలించిన తర్వాతే ప్రవేశాలు పొందాలని స్పష్టం చేసింది. అనుమతి లేని కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలు చేసే తప్పుడు ప్రచారాలు, ఆకర్షణీయ ప్రకటనలను నమ్మి మోసపోవద్దని హెచ్చరించింది. ఏదైనా సందేహం ఉంటే వెంటనే TGBIE అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu