Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Telangana SIR : రాష్ట్రంలో సర్ గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 చివరి తేదీ!

Telangana SIR : రాష్ట్రంలో సర్ గడువు మరోసారి పొడిగింపు.. ఆగస్టు 10 చివరి తేదీ!

రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించి ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకునేందుకు వీలుగా, ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించే తుది గడువును మరోమారు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. తొలుత ఈ గడువును జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు పెంచగా, తాజాగా ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో ఉంచుకుని దానిని ఆగస్టు 10 వరకు పొడిగించారు.

కేంద్ర ఎన్నికల సంఘం తాజా ఆదేశాల ప్రకారం.. బూత్ స్థాయి అధికారులు (BLOలు) నిర్వహించే ఇంటింటి సర్వే, ఎన్యూమరేషన్ ప్రక్రియ ఆగస్టు 10 వరకు కొనసాగుతుంది. ఈ పొడిగింపు కారణంగా, ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ తేదీతో పాటు తదుపరి షెడ్యూల్‌లోనూ మార్పులు చోటుచేసుకున్నాయి. సవరించిన నిబంధనల ప్రకారం ముసాయిదా ఓటర్ల జాబితా ఇకపై ఆగస్టు 10న విడుదల కానుంది. అలాగే, జాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల స్వీకరణ ప్రక్రియ ఆ తేదీ నుంచి సెప్టెంబర్ 9 వరకు ఉంటుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

రాష్ట్రంలో జరుగుతున్న ఈ సమగ్ర సవరణ ప్రక్రియ చాలా వరకు విజయవంతంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సంఘం అధికారిక గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 77.12 శాతం ఎన్యూమరేషన్ పనులు పూర్తయ్యాయి. అయితే ప్రధాన నగరాలు, చుట్టుపక్కల ఉన్న జిల్లాలలో మాత్రం ఈ సర్వే వేగం కొంత నెమ్మదిగా సాగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రధాన పట్టణ ప్రాంతాలైన.. హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం మాత్రమే ఎన్యూమరేషన్ పూర్తయింది. రంగారెడ్డి జిల్లాలో 63.43 శాతం మేర సర్వే కవర్ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం ప్రక్రియ ముగిసింది.

ఈ మూడు ప్రధాన జిల్లాల్లో ఇంకా గణనీయమైన సంఖ్యలో ఫారాలు అందాల్సి ఉండటమే గడువు పొడిగింపునకు ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఎన్నికల సంఘం కల్పించిన ఈ అదనపు సమయాన్ని అర్హులైన ప్రతి ఒక్క పౌరుడు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోరారు. ఇంకా ఎన్యూమరేషన్ ఫారాలు పూర్తి చేసి అందించని వారు వెంటనే స్థానిక BLOలను సంప్రదించి తమ వివరాలను సరిచూసుకోవాలని సూచించారు. సరైన సమచారంతో పారదర్శకమైన, తప్పులేని ఓటర్ల జాబితాను రూపొందించడమే ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రధాన ఉద్దేశమని యంత్రాంగం పేర్కొంది. తుది గడువు ముగిసేలోపు మిగిలిన ప్రక్రియను కూడా వంద శాతం పూర్తి చేసేలా జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu