ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సోషల్ మీడియా వేదికగా సాగుతున్న పొలిటికల్ వార్ ఇప్పుడు అరెస్టుల పర్వానికి దారితీసింది. రాజకీయాలపై విమర్శలు, కామెంట్లు చేసే ప్రముఖ యూట్యూబర్లు 'ప్రశ్న' ఛానల్ నిర్వాహకుడు రావణ్, అలాగే జర్నలిస్ట్ కె.
వెంకటరామిరెడ్డి (కేవీఆర్)లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో ఉన్న వీరిద్దరినీ జూన్ 30 రాత్రి ఏపీ పోలీసులు అరెస్ట్ చేయడం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తీవ్ర సంచలనంగా మారింది.
కేసులు ఎందుకు నమోదయ్యాయి?
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై వీరిపై కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ పోలీస్ స్టేషన్‌లో జూన్ 29న 'ప్రశ్న రావణ్'పై కేసు నమోదైంది. హిందూ మతంపై, దేవతలపై, అలాగే పవన్ కళ్యాణ్‌పై రావణ్ వివాదాస్పద, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ జనసేన కార్యక్రతలు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారు. సమాజంలో మత విద్వేషాలను రగల్చడం, పరువు నష్టం తదితర సెక్షన్ల కింద ఆయనపై కేసులు పెట్టారు.
మరోవైపు, జర్నలిస్ట్ కేవీఆర్‌పై గతంలోనే విజయనగరం జిల్లా బాడంగి పోలీస్ స్టేషన్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అభ్యంతరకర థంబ్‌నైల్స్, అసభ్యకర పోస్టులు పెట్టారనే ఆరోపణలపై కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు?
ప్రశ్న రావణ్‌ను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం విచారణ అనంతరం రాత్రి పిఠాపురంలో మెజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా, పూచీ కత్తుపై బెయిల్ మంజూరు చేశారు. అయితే మరో కేసులో అతడిని వెంటనే సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2025లో నమోదైన మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ఇక జర్నలిస్ట్ కేవీఆర్‌ను కూడా ఏపీ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణకు చెందిన కేవీఆర్‌ను ఏపీలోని విజయనగరం జిల్లా బాడంగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశారని 2 నెలల క్రితం బాడంగి మాజీ సర్పంచ్ కండి రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నోటీసులు ఇచ్చారు. కేవీఆర్‌ను మంగళవారం రాత్రి హైదరాబాద్ సరూర్‌నగర్‌లో అదుపులోకి తీసుకున్నారు. బొబ్బిలి పీఎస్‌కు తరలించారు.
రాజకీయ దుమారం.. భావప్రకటన స్వేచ్ఛపై చర్చ
ఈ అరెస్టులు తెలంగాణ ఏపీ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను నొక్కుతోందని పలువురు విమర్శిస్తుండగా, జర్నలిజం ముసుగులో మత విద్వేషాలు రగిల్చే వారిని వదిలిపెట్టకూడదని మరికొందరు అంటున్నారు. ఈ అరెస్టులతో సోషల్ మీడియా వేదికగా పొలిటికల్ కామెంట్లు చేసే మిగిలిన యూట్యూబర్లలోనూ ఆందోళన మొదలైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భావప్రకటన స్వేచ్ఛ ఇతరులను ఇబ్బందిపెట్టేలా ఉండకూడదని అన్నారు. సోషల్ మీడియా దుర్వినియోగంపై చట్టం తీసుకొస్తామన్నారు. అంతేకాదు ఫిర్యాదుల కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Anand Sai

