Telugu Web Series: ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా వీడియో ఇప్పుడు 'ఆకలి రాజ్యం 2026' పేరుతో ఓ సరికొత్త వెబ్ సిరీస్ ను స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది.
తాజాగా మంగళవారం (జులై 7) ఈ సిరీస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేసింది. స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేయకపోయినా.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంజినీరింగ్ స్టూడెంట్ చూడాల్సిన కథగా రూపొందించినట్లు వీడియో చూస్తే తెలుస్తోంది.
ఆకలి రాజ్యం 2026 ప్రోమో
ఆకలి రాజ్యం సినిమా గుర్తుందా? అప్పుడెప్పుడో నాలుగు దశాబ్దాల కిందట వచ్చిన మూవీ. దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి ఉద్యోగాలు దొరక్క కష్టాలు పడే కొందరు యువకుల చుట్టూ తిరిగే కథ అది. కమల్ హాసన్, శ్రీదేవి జీవించేశారు. ఇప్పుడదే టైటిల్ తో ఆహా వీడియో ఓటీటీ ఓ కొత్త వెబ్ సిరీస్ తీసుకొస్తోంది. ఆకలి రాజ్యం 2026 అంటూ ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించినట్లు తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే తెలుస్తోంది.
యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట
ఈ ఆకలి రాజ్యం 2026 వెబ్ సిరీస్ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు.. అనంతపురం నుంచి ఆదిలాబాద్ వరకు తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ చదివిన ప్రతి స్టూడెంట్ తర్వాత లక్ష్యం యూఎస్ఏ అంటూ ఈ ప్రోమో మొదలవుతుంది. ఇక్కడ యూఎస్ఏ అంటే అమెరికా కాదు.. ఆ అమెరికా కలలను సాకారం చేసేందుకు తొలి అడుగు పడే యునైటెడ్ స్ట్రీట్స్ ఆఫ్ అమీర్‌పేట.
వచ్చిన ఉద్యోగంతో సర్దుకుపోయే వాళ్లు కొందరైతే.. నచ్చిన ఉద్యోగం కోసం ప్రయత్నించే వాళ్లు మరికొందరు.. కథలు, కలలు, మనుషులు, ఎన్నో సంగతులు.. ఈ కథ మీదే కావచ్చు అంటూ ప్రోమో ముగుస్తుంది. ఇంజినీరింగ్ పూర్తి చేసి సాఫ్ట్‌వేర్ జాబ్ కలలతో అమీర్‌పేట అక్కడి నుంచి అమెరికా వెళ్దామని కలలు కంటూ వచ్చే స్టూడెంట్స్ చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ లా ఈ ఆకలి రాజ్యం 2026 కనిపిస్తోంది.
ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్
ఈ ఆహా ఒరిజినల్ వెబ్ సిరీస్ ఆకలి రాజ్యం 2026ను నీలగిరి మామిళ్ల డైరెక్ట్ చేస్తున్నారు. "ఇది ఉద్యోగం కోసం ఇల్లు వదిలిన ప్రతి స్టూడెంట్ కోసం.. వీ విల్ గెట్ బ్యాక్ టు యు అని ముగిసే ప్రతి ఇంటర్వ్యూ కోసం.. కలలు, గౌరవం, విప్లవానికి చెందిన కథ.. ఆకలి రాజ్యం 2026 ఆహాలో కమింగ్ సూన్" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను ఆ ఓటీటీ ట్వీట్ చేసింది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన మరిన్ని వివరాలతోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా ఆహా వీడియో ఓటీటీ వెల్లడించే అవకాశం ఉంది.
Hari Prasad S, Hyderabad

