రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ (TG EAPCET 2026) కౌన్సెలింగ్ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా అభ్యర్థులు నమోదు చేసుకున్న ఐచ్ఛికాల ఆధారంగా అధికారులు మాక్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి అయింది.
అభ్యర్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చే అవకాశం ఉందో ఒక అంచనాకు రావడానికి ఈ మాక్ అలాట్‌మెంట్ ఎంతో ఉపయోగపడుతుంది.
మాక్ అలాట్‌మెంట్ ఫలితాలను చూసుకున్న తర్వాత, అభ్యర్థులు ఎవరైనా తమ ప్రాధాన్యాలను మార్చుకోవాలని భావిస్తే వారికి అధికారులు మరో అవకాశం కల్పించారు. అభ్యర్థులు తమ వెబ్ ఆప్షన్లలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి జూలై 5 నుంచి జూలై 7 వరకు గడువు ఇచ్చారు.
ఒకవేళ అభ్యర్థులు తమ ఆప్షన్లను మార్చకపోతే, మాక్ అలాట్‌మెంట్ కోసం గతంలో పెట్టుకున్న ఆప్షన్లనే మొదటి విడత సీట్ల కేటాయింపునకు తుది ఆప్షన్లుగా పరిగణిస్తామని కౌన్సెలింగ్ విభాగం స్పష్టం చేసింది.
సీట్ల కేటాయింపు ఎప్పుడంటే… ?
షెడ్యూల్ ప్రకారం…. జూలై 7వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత జూలై 10వ తేదీన లేదా అంతకంటే ముందే మొదటి విడత ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను వెబ్‌సైట్‌లో అధికారికంగా విడుదల చేస్తారు.
సీట్లు పొందిన అభ్యర్థులు జూలై 10 నుండి జూలై 14 మధ్య కాలంలో ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్ ద్వారానే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు గడువు తేదీలను గమనించి, తదనుగుణంగా తమ వెబ్ ఆప్షన్లను సరిచూసుకోవాలని అధికారులు సూచించారు.
జులై 17 నుంచి రెండో విడత కౌన్సెలింగ్
టీజీ ఈఏపీసెట్ - 2026 మొదటి విడత సీట్ల కేటాయింపు ముగిసిన అనంతరం….. జులై 17వ తేదీ నుండి రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, జులై 18, 19 తేదీల్లో విద్యార్థులు రెండో విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా విద్యార్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
Maheshwaram Mahendra Chary

