Dailyhunt
TG Fee Reimbursements : విద్యార్థుల నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వసూలు..! హైకోర్టు తీర్పుతో ఆందోళనలో విద్యార్థులు

TG Fee Reimbursements : విద్యార్థుల నుంచే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వసూలు..! హైకోర్టు తీర్పుతో ఆందోళనలో విద్యార్థులు

రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపుల విషయంలో చాలా రోజులుగా సందిగ్ధత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓవైపు బకాయిలను క్లియర్ చేస్తేనే విద్యార్థుల సర్టిఫికెట్లను ఇస్తామని కాలేజీలు తేల్చి చెబుతున్నాయి.

మరోవైపు పెండింగ్ బకాయిల కట్టలేక విద్యార్థులు సతమవుతున్నారు.ఈ విషయంలో కాలేజీల యాజమాన్యాలు… న్యాయపోరాటం కూడా చేస్తున్నాయి. ఈ కేసులో తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను ఇచ్చింది.

విద్యార్థుల నుంచే వసూలు చేసుకోండి..!

విద్యార్థుల నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఫీజు వసూలు చేసుకోవాలని ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు కేవలం వచ్చే విద్యా సంవత్సరం 2026-27 నుంచే వర్తిస్తాయని పేర్కొంది. ప్రభుత్వం కాలేజీలకు చెల్లించిన తర్వాత సదరు విద్యార్థులకు వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ కేసు విచారణ సందర్భంగా కాలేజీల తరపున న్యాయవాదులు పలు అంశాలను ప్రస్తావించారు. విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేయకుండా గతంలో ప్రభుత్వం నుంచి జీవోలు ఉన్నాయని తెలిపారు. ఈ ఉత్తర్వుల తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు క్రమంగా పేరుకుపోయాయని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ కళాశాలలకు కోట్ల రూపాయల మేర ట్యూషన్‌ ఫీజు బకాయిలను విడుదల చేయాల్సి ఉందని వివరించారు. బకాయిలు విడుదల కాకపోవటంతో… కాలేజీల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని చెప్పారు. సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితీ లేదని ప్రస్తావించారు.

తరపున న్యాయవాదుల వాదనలు విన్న న్యాయస్థానం…. ఇప్పటివరకు పేరుకుపోయినబకాయిలపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 30వ తేదీకి వాయిదా వేసింది.

మరోవైపు హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేపథ్యంలో… రాష్ట్రంలోని మరికొన్ని ప్రైవేట్ కాలేజీలు కూడా ఇదే కేసులో 'ఇంప్లీడ్‌' పిటిషన్లు దాఖలు చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 11న ప్రైవేటు కాలేజీల మేనేజ్‌మెంట్ల సంఘం (ఫతీ) జనరల్ బాడీ సమావేశం నిర్వహించనుంది.

తాజా తీర్పుపై పలు సంఘాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలనుకోవటం సరికాదని చెబుతున్నాయి. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్పీల్‌కు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. . ఫీజు రీయింబర్స్‌మెంట్‌ స్కాలర్‌ షిప్‌ బకాయిలను సర్కారు తక్షణమే విడుదల చేయాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

ప్రభుత్వం వెంటనే స్పందించాలి - మాజీ మంత్రి సబితా

"రాష్ట్రంలో ఏటా 13 లక్షల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు ఫీ రీయింబర్స్ మెంట్ పథకంపై ఆధారపడి చదువుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాష్ట్రంలో చదువుతున్న 13 లక్షల BC, SC, ST మరియు మైనారిటీ విద్యార్థుల చదువుపై ప్రభావం చూపే అవకాశం ఉంది, ఈ తీర్పుతో విద్యార్థులు చాలా మానసిక ఆందోళన చెందే అవకాశం ఉంది. ఇపటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలి. ప్రభుత్వమే ఫీజ్ రీయింబర్స్మెంట్ చెల్లిస్తుందని ప్రకటన చేసి విద్యార్థులకు భరోసా కల్పించాలి" అని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.

ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని… కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. పెండింగ్ బకాయిలను క్లియర్ చేసే విషయంలో సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu