తెలంగాణలో అనధికార ప్లాట్లు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ (LRS - Layout Regularization Scheme) దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది.
ఎల్ఆర్ఎస్ రుసుము చెల్లింపుపై 25 శాతం రాయితీ పొందే అవకాశాన్ని 2026 నవంబర్ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ (MA&UD) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ జీవో జారీ చేశారు.
దీనిద్వారా ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ రుసుమును నిర్ణీత గడువులోగా చెల్లించే ప్లాట్ల యజమానులకు 25 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ సదుపాయం 2026 ఆగస్టు 1వ తేదీ నుండి 2026 నవంబర్ 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న లక్షలాది ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి ఈ నిర్ణయం దోహదపడనుంది. రుసుముపై 25 శాతం ముందస్తు రాయితీని పునరుద్ధరించడం వల్ల ప్లాట్ల యజమానులకు ఆర్థిక భారం గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్లాట్ల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం కానుంది. లేఅవుట్లు క్రమబద్ధీకరించుకోవడం ద్వారా ప్లాట్లకు చట్టబద్ధత లభించి, రిజిస్ట్రేషన్లు, బ్యాంక్ రుణాలు పొందేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రభుత్వ జీవో ప్రకారం సంబంధిత HMDA, జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు దీనికి అనుగుణంగా అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గతేడాదిలో 31 మార్చి 2026 వరకు 25 శాతం రాయితీ కల్పిస్తూ.. ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. దీనితో రూ.10వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మూడుసార్లు గడువు పొడిగించినా.. రూ.2 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఎస్ఐఆర్ కారణంగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నార. దీంతో ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వరకు పొడిగిస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.
Anand Sai

