Dailyhunt
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఏప్రిల్ నెలలోని విశేష పర్వదినాలు, లిస్ట్ ఇదే

Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్ - ఏప్రిల్ నెలలోని విశేష పర్వదినాలు, లిస్ట్ ఇదే

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఏప్రిల్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. ఏప్రిల్ 13న శ్రీభాష్యకారుల ఉత్సవారంభం, ఏప్రిల్ 20న అక్షయ తృతీయ ఉంటుందని పేర్కొంది.

ఏప్రిల్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు:

• ఏప్రిల్ 13న శ్రీభాష్యకారుల ఉత్సవారంభం.

• ఏప్రిల్ 20న అక్షయ తృతీయ, పరశురామ జయంతి, భృగు మహర్షి వర్ష తిరు నక్షత్రం, శ్రీనివాస దీక్షితుల వర్ష తిరు నక్షత్రం

• ఏప్రిల్ 21న అనంతాళ్వాన్ ఉత్సవారంభం, శ్రీ శంకర జయంతి.

మరోవైపు తిరుమలకు వచ్చే భక్తులకు టీటీడీ మరో ముఖ్యమైన అలర్ట్ ఇచ్చింది. భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు మారమ్మతు పనులు వేగంగా సాగుతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో వాహనదారులు మరింత అప్రమత్తంగా వాహనాలను నడపాలని విజ్ఞప్తి చేసింది.

శ్రీవారి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఘాట్ రోడ్డును మూసివేయలేదని టీటీడీ స్పష్టం చేసింది. అయితే నిర్దేశించిన సమయంలో మరమ్మతు పనులను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. భక్తులు వారి తిరుమల ప్రయాణాన్ని తదనుగుణంగా మార్చుకుని కనీసం గంట ముందుగా ప్రారంభించాలని కోరింది.

మరమ్మతుల కారణంగా వాహనదారులు నెమ్మదిగా అక్కడక్కడా కొద్ది సేపు ఆగుతూ ప్రయాణించాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించాలని టీటీడీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తిరుమల నుంచి రేణిగుంట విమానాశ్రయం, తిరుపతి రైల్వేస్టేషన్, ఆర్డీసీ బస్ స్టాండ్లు వెళ్ళే భక్తులు ముందస్తుగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని వాహనదారులు, భక్తులు తమ తిరుమల ప్రయాణన్ని రూపొందించుకోవాలని టీటీడీ కోరింది. నిర్దేశించిన సమయంలో పనులు పూర్తి కావడానికి భక్తులు, వాహనదారులు సహకరించాలని కోరింది.

Maheshwaram Mahendra Chary, Tirumala

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu