Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణ - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

తిరుపతి : మార్మోగిన గోవింద నామస్మరణ - వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

Tirupati Govindaraja Swamy Brahmotsavam 2026 : కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత నయనానందకరంగా సాగుతున్నాయి.

ఉత్సవాల్లో అత్యంత కీలకమైన ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. "గోవిందా.. గోవిందా.." అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో తిరుపతి పురవీధులు మార్మోగాయి. వేలాది మంది భక్తులు భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో స్వామివారి రథాన్ని లాగి తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.

ఉదయం 5.40 గంటల శుభ ముహూర్తాన ప్రారంభమైన ఈ రథోత్సవం కర్ణాల వీధి, బేరి వీధి, గాంధీ రోడ్డు మీదుగా సాగింది. స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకునేందుకు భక్తులు రోడ్ల ఇరుపక్కలా భారీగా నిలిచారు. రథం కదిలిన మార్గమంతా భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు. అనంతరం రథం తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది.

సనాతన ధర్మంలో రథోత్సవానికి కేవలం ఒక వేడుకగానే కాకుండా, ఆత్మజ్ఞానాన్ని బోధించే మహత్తర తాత్త్విక సందేశంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవ శరీరమే ఒక రథం. అందులోని ఆత్మను రథికుడిగా, శరీరాన్ని రథంగా, మానవ బుద్ధిని రథ సారథిగా, మనసును పగ్గంగా, మన ఇంద్రియాలను గుర్రాలుగా, బాహ్య ప్రపంచంలోని విషయాలను వీధులుగా భావించాల్సి ఉంటుంది. దీని ద్వారా ఆత్మ-అనాత్మ వివేకాన్ని, జీవిత పరమార్థాన్ని ఈ ఉత్సవం భక్తులకు నొక్కి చెబుతుంది.

వేడుకగా స్నపన తిరుమంజనం

రథోత్సవం విజయవంతంగా ముగిసిన అనంతరం ఆలయంలో ఇతర ధార్మిక కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 10.30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారికి, నమ్మాళ్వార్ల ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, సుగంధ ద్రవ్యాలు, వివిధ రకాల పండ్లరసాలతో విశేషంగా అభిషేకం చేశారు.

  • బ్రహ్మోత్సవాల క్రతువులో భాగంగా శనివారం సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు స్వామివారికి ఊంజల్‌సేవ (ఊయల సేవ) జరగనుంది.
  • ఆ తర్వాత రాత్రి 7 నుండి 9 గంటల వరకు అత్యంత వైభవంగా అశ్వవాహన సేవను నిర్వహించనున్నారు.
  • కల్కి అవతార స్వరూపుడైన గోవిందుడు అశ్వవాహనంపై అధిరోహించి భక్తులకు దివ్య దర్శనమివ్వనున్నారు.
  • శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 31, ఆదివారంతో ముగియనున్నాయి.
  • ముగింపు వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు తిరుపతిలోని ప్రసిద్ధ కపిలతీర్థం (ఆళ్వార్ తీర్థం)లో చక్రస్నాన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
  • ఇందుకోసం ఉదయం 6 గంటలకే శ్రీ గోవిందరాజస్వామివారు, అమ్మవార్లు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకీలో కొలువై కపిలతీర్థ క్షేత్రానికి ఊరేగింపుగా బయలుదేరనున్నారు.
  • కపిలతీర్థంలో పవిత్ర చక్రస్నానం పూర్తయిన అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను పీఆర్‌ తోటకు వేంచేపు చేస్తారు. అక్కడ ప్రత్యేక పూజలు అందుకున్న అనంతరం… సాయంత్రం 6 గంటలకు స్వామివారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

Maheshwaram Mahendra Chary, Tirupati

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu