Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toll exemption list : వీఐపీ సంస్కృతికి బ్రేక్! వారికి ఇక ఫ్రీ టోల్​ రైడ్స్​ రద్దు..

Toll exemption list : వీఐపీ సంస్కృతికి బ్రేక్! వారికి ఇక ఫ్రీ టోల్​ రైడ్స్​ రద్దు..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు ఇచ్చే టోల్ ఫీజు మినహాయింపుల జాబితాను భారీగా తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది! నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్​హెచ్​ఏఐ) నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఉన్న మినహాయింపుల వ్యవస్థను సమీక్షించిన ఒక ఉన్నత స్థాయి కమిటీ..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపులను పూర్తిగా తొలగించాలని సిఫార్సు చేసింది. దేశంలో 'వీఐపీ సంస్కృతి'కి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రత్యామ్నాయంగా ఉన్న 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్' వివరాలు ఇక్కడ చూద్దాము.

టోల్ ఫీజు మినహాయింపు కోల్పోయేది ఎవరు?

ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం.. జాతీయ రహదారుల రుసుము నిబంధనలను సవరించడంపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రస్తుతం తీవ్రంగా చర్చిస్తోంది. ఇందులో భాగంగానే టోల్​ ఛార్జీల మినహాయింపు లిస్ట్​ చర్చకు వచ్చింది. ఒకేసారి పెద్ద మార్పులు చేసి గందరగోళం సృష్టించకుండా, ఈ మినహాయింపుల తగ్గింపు ప్రక్రియను దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు.

ఈ కొత్త ప్రతిపాదనలు గనుక అమల్లోకి వస్తే, మొదటగా ప్రభుత్వ అధికారుల వాహనాలకే టోల్ మినహాయింపులు రద్దు కానున్నాయి.

కారణం: టోల్ ప్లాజాల వద్ద సాధారణ పౌరులకు ఇబ్బందిగా మారిన 'వీఐపీ సంస్కృతి'ని తగ్గించడానికి ఈ నిర్ణయం దోహదపడుతుంది.

ప్రత్యామ్నాయం: ఈ మార్పు కోసం ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించింది. వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపులు కోరడానికి బదులుగా.. 'ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్'లని ఉపయోగించేలా ప్రోత్సహిస్తోంది.

ఫాస్ట్‌ట్యాగ్ యాన్యువల్ పాస్ అంటే ఏంటి?

ఈ యాన్యువల్ పాస్ అనేది ఒక ప్రీపెయిడ్ టోల్ ప్లాన్.

ఫీచర్లు: ఈ పాస్ ద్వారా ఒక వినియోగదారుడు 1 సంవత్సరం పాటు లేదా దేశవ్యాప్తంగా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ధర: ప్రస్తుతం ఈ వార్షిక పాస్ ధర రూ. 3,075 గా ఉంది. ఇటీవల దీని ధరను.. గతంలో ఉన్న రూ. 3,000 నుంచి రూ. 75 మేర పెంచారు.

ప్రస్తుతం టోల్ మినహాయింపు ఉన్న వాహనాలు..

ప్రస్తుత నిబంధనల ప్రకారం.. దేశంలో మొత్తం 25 రకాల ఉన్నత ప్రభుత్వ పదవుల్లో ఉన్న వ్యక్తులు, వారిని అనుసరించే వాహనాలకు జాతీయ రహదారులపై టోల్ ఫీజు మినహాయింపు ఉంది.

మినహాయింపు ఉన్న ఇతర కేటగిరీలు :

వీఐపీలతో పాటు అధికారిక విధుల్లో ఉన్న కింది వాహనాలకు ప్రస్తుతం టోల్ మినహాయింపు వర్తిస్తోంది:

యూనిఫాంలో ఉన్న రక్షణ సిబ్బంది

కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలు, పారామిలటరీ గ్రూపులు

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు

అగ్నిమాపక సిబ్బంది

హైవే ఇన్స్పెక్షన్ టీమ్స్

అంబులెన్స్‌లు, శవవాహనాలు.

ప్రభుత్వ అధికారుల మినహాయింపులను రద్దు చేయడం ద్వారా టోల్ ప్లాజాల వద్ద ఆదాయం పెరగడమే కాకుండా, సాధారణ వాహనదారుల లాగే అధికారులు కూడా లైన్లలో వేచి ఉండేలా పారదర్శకత వస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu