Toxic Censor: కేజీఎఫ్ తో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ రాక్ స్టార్ యశ్. ఈ మూవీస్ తర్వాత గ్యాప్ తీసుకుని ఇప్పుడు 'టాక్సిక్' అంటూ థియేటర్లకు రాబోతున్నాడు.
కానీ ఈ మూవీ గ్లింప్స్ నుంచి లేడీస్ అండ్ లేడీస్ వీడియో వరకూ అంతా వివాదాస్పదమే. ఈ మూవీలోని మితిమీరిన శృంగార సీన్లు, హద్దుల్లేని విధ్వంసకర వైలెన్స్ ఇందుకు కారణమని చెప్పొచ్చు.
ఇప్పుడు ఇదే ట్రెండ్
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కువ వైలెన్స్ ఉంటేనో లేదా మితిమీరిన శృంగారం ఉంటేనో మూవీ హిట్ అవుతుందనే టాక్ ఉందని అంటున్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ ఫార్ములాను ఫాలో అయ్యే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు టాక్సిక్ కూడా ఇదే లిస్ట్ లో చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వేరే లెవల్ బోల్డ్
టాక్సిక్ గ్లింప్స్ రిలీజ్ అయినప్పుడే వివాదం భగ్గున రేకెత్తింది. ఈ గ్లింప్స్ లో కార్లో ఓ అమ్మాయితో యశ్ చేసే శృంగారం మరీ మితిమీరిందనే విమర్శలు వచ్చాయి. ఈ కాంట్రవర్సీ ఉండగానే ఇప్పుడు లేడీస్ అండ్ లేడీస్ అంటూ మూవీ హీరోయిన్లను పరిచయం చేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో అయితే బోల్డ్ మోతాదు మరింత పెంచారు. అందుకే ఇది సినిమానా? లేదా బూతు చిత్రమా? అనే విమర్శలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.
సెన్సార్ కత్తి
మూవీ ప్రమోషన్స్ కోసం టీమ్ బాగానే వీడియోలు రిలీజ్ చేస్తుంది. అయితే ఈ వీడియోలు చూసిన తర్వాత టాక్సిక్ కు అసలు సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందా? సీబీఎఫ్ సీ ఎన్ని కట్లు చెబుతుంది? అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. యశ్ టాక్సిక్ మూవీ ఆగస్టు 26న థియేటర్లలోకి రాబోతుంది. ఈ నేపథ్యంలో టాక్సిక్ పై సెన్సార్ కత్తెర వేలాడటం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.
అదే ప్రొడక్షన్ హౌస్
కన్నడ చిత్రసీమలో అత్యంత ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ ఇప్పుడు నెమ్మదిగా తెలుగు, తమిళ, హిందీ పరిశ్రమల్లోకి పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లతో దూసుకొస్తోంది. టాక్సిక్ మూవీని ఈ ప్రొడక్షన్ హౌస్ నిర్మించింది.
అయితే కేవీఎన్ ప్రొడక్షన్స్‌కు సెన్సార్ బోర్డుతో ఇబ్బందులు ఎదురవడం కొత్తేమీ కాదు. గతంలో ఈ సంస్థ బ్యాకింగ్‌తో వచ్చిన 'జన నాయగన్' సినిమా సెన్సార్ పరంగా లేట్ అవుతోంది. ఇంకా రిలీజ్ కు కూడా నోచుకోలేదు. ఆ తర్వాత కన్నడ పీరియాడిక్ డ్రామా 'కేడీ - ది డెవిల్' సైతం దాని రా అండ్ రస్టిక్ కంటెంట్ కారణంగా ఇలాంటి సెన్సార్ ఇంట్రెస్ట్‌నే క్రియేట్ చేసింది.
'టాక్సిక్' డోస్ మితిమీరుతోందా?
గోవా బ్యాక్‌డ్రాప్‌లో 1940 నుండి 1970 మధ్య కాలంలో సాగే క్రూరమైన మాఫియా, డ్రగ్స్ సామ్రాజ్యం కథతో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఈ టాక్సిక్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి టాప్ హీరోయిన్లు పవర్‌ఫుల్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇటీవల ఈ సినిమా 100 రోజుల రీషూట్ జరుపుకుంటోందంటూ వచ్చిన రూమర్లను కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా ఖండించింది. సినిమా అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చిందని, ఎలాంటి రీషూట్లు జరగడం లేదని స్పష్టం చేసింది. అయితే మితిమీరిన వయొలెన్స్, బోల్డ్ నెస్ వల్ల సెన్సార్ వద్ద కట్స్ పడకుండా నిర్మాతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.
Chandu Shanigarapu

