Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Toxic Collection: బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్‌.. యశ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్

Toxic Collection: బాక్సాఫీస్ ఊచకోత.. నెగెటివ్ టాక్‌తోనూ దుమ్మురేపిన టాక్సిక్‌.. యశ్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్లు అదుర్స్

Toxic Collection: నెగెటివ్ రివ్యూలు, విడుదల వాయిదా వార్తలు, కథలో హింస, ఘాటైన శృంగార సన్నివేశాలపై చెలరేగిన వివాదాలు... ఇవేవీ రాకింగ్ స్టార్ యశ్ బాక్సాఫీస్ ఊచకోతను అడ్డుకోలేకపోయాయి.

కేజీఎఫ్ సిరీస్ తర్వాత నాలుగేళ్ల సుదీర్ఘ విరామం అనంతరం యశ్ హీరోగా వచ్చిన 'టాక్సిక్' చిత్రం థియేటర్లలో సునామీ సృష్టిస్తోంది. ఓనం పండుగ సందర్భంగా బుధవారం (ఆగస్టు 26) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలిరోజే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.

టాక్సిక్ కలెక్షన్

బాక్సాఫీస్ అంచనాల ట్రాకింగ్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) నివేదిక ప్రకారం, 'టాక్సిక్' చిత్రం ఇండియాలో ఫస్ట్ రోజు ఏకంగా రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది. ఇందులో అత్యధిక వాటా హిందీ వెర్షన్ నుంచే రావడం విశేషం. కేవలం హిందీ డబ్బింగ్ వర్షన్ ద్వారానే తొలిరోజే రూ.55 కోట్ల నెట్ కలెక్షన్లు నమోదయ్యాయి. ఇక మాతృభాష అయిన కన్నడ వెర్షన్ రూ.25 కోట్ల లోపే వసూలు చేసినప్పటికీ, రోజంతా థియేటర్లలో ఏకంగా 89 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఇక తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. తమిళ, మలయాళ వర్షన్లు మాత్రం కాస్త మందకొడిగా సాగుతున్నాయి.

ఆ రికార్డులు అవుట్

గతేడాది డిసెంబర్‌లో విడుదలై సంచలనం క్రియేట్ చేసిన ధురంధర్ రికార్డును టాక్సిక్ తో యశ్ బ్రేక్ చేశాడు. రూ.1300 కోట్ల కలెక్షన్లు సాధించిన ధురంధర్ ఓపెనింగ్ వసూళ్లను టాక్సిక్ మూవీ మార్నింగ్ షోల ద్వారానే దాటేసింది. రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' చిత్రం రూ.28 కోట్ల నెట్ ఓపెనింగ్‌తో మొదలైంది.

మరోవైపు మధ్యాహ్నం షోల సమయానికి షారుఖ్ ఖాన్ 'పఠాన్', 'జవాన్', రణ్‌బీర్ కపూర్ 'యానిమల్' చిత్రాల తొలిరోజు రికార్డులను టాక్సిక్ బ్రేక్ చేసింది. ఇక సాయంత్రానికి ప్రభాస్ 'కల్కి 2898 AD' చిత్రం తొలిరోజు వసూళ్లను కూడా 'టాక్సిక్' క్రాస్ చేసేసింది.

కేజీఎఫ్ 2కు దూరంగా

అయితే, 2026లో బెస్ట్ ఓపెనింగ్ సాధించిన 'ధురంధర్ 2' (రూ.103 కోట్లు) రికార్డును దాటడంలో 'టాక్సిక్' తృటిలో విఫలమైంది. అలాగే కన్నడ సినీ చరిత్రలోనే అత్యధికంగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' సాధించిన రూ.116 కోట్ల తొలిరోజు ఆల్‌టైమ్ రికార్డును కూడా ఈ సినిమా అందుకోలేకపోయింది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ. 60 కోట్ల హవా

ఆగస్టు 21న ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ప్రీ-సేల్స్ ద్వారానే టాక్సిక్ సినిమా స్థాయి ఏమిటో స్పష్టమైంది. ఐదు రోజుల పాటు సాగిన బుకింగ్స్ మోతతో బుధవారం ఉదయానికి ఏకంగా 18 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలోనే తొలిరోజు కోసం రూ. 60 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

'A' సర్టిఫికేట్‌తో సంచలనం

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ భారీ రివేంజ్ డ్రామాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రలు పోషించారు. సినిమాలో ఉన్న ఘాటైన రొమాంటిక్ సన్నివేశాలు, బోల్డ్ సంభాషణలతో పాటు మహిళలను చూపించిన విధానంపై వివాదాలు నెలకొన్నప్పటికీ, సెన్సార్ బోర్డు (CBFC) ఎలాంటి కట్స్ లేకుండా ఈ చిత్రానికి 'A' (అడల్ట్స్ ఓన్లీ) సర్టిఫికేట్ మంజూరు చేసింది.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu