Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
TV Serial Heroine: నాన్ స్టాప్‌గా 6 రోజులు నిద్ర లేదు, ఆమె పిలిస్తే కాదనడం సాధ్యం కాదు: బుల్లితెరపై సీరియల్ హీరోయన్

TV Serial Heroine: నాన్ స్టాప్‌గా 6 రోజులు నిద్ర లేదు, ఆమె పిలిస్తే కాదనడం సాధ్యం కాదు: బుల్లితెరపై సీరియల్ హీరోయన్

Serial Heroine Shubhangi Atre On TV Industry: టీవీ సీరియళ్ల కలర్‌ఫుల్ ప్రపంచం వెనుక నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. గ్లామర్ వెనుక నిద్రలేని రాత్రులు, ఒత్తిడితో కూడిన సుదీర్ఘ పని గంటలు ఉంటాయి.

తాజాగా ఈ అంశంపై 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్ ఫేమ్, ప్రముఖ హిందీ నటి శుభాంగి ఆత్రే స్పందించారు. తన కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న తీవ్రమైన పని ఒత్తిడిని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

ది మేల్ ఫెమినిస్ట్ షోలో సీరియల్ హీరోయిన్

అప్పట్లో బాలాజీ టెలిఫిల్మ్స్ అధినేత్రి ఏక్తా కపూర్ తీసే సీరియళ్లకు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉండేది. రోజువారీ ఎపిసోడ్లు టెలికాస్ట్ చేయాల్సిన ఒత్తిడి వల్ల నటీనటులకు నాన్-స్టాప్ వర్క్ ఉండేది. 'హౌటెర్‌ఫ్లై' చాట్ షో 'ది మేల్ ఫెమినిస్ట్'లో మాట్లాడిన శుభాంగి ఆత్రే.. 'కసౌటీ జిందగీ కే' సీరియల్ చేస్తున్న సమయంలో తనకు ఎదురైన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు.

ఏక్తా కపూర్ ఆఫర్.. అప్పట్లో వద్దనుకున్నా!

"కసౌటీ జిందగీ కే కోసం ఇప్పటికే రాత్రింబవళ్లు పనిచేస్తున్నాను. మరో కొత్త సీరియల్ చేయలేనని అసిస్టెంట్ డైరెక్టర్ అభిషేక్‌తో చెప్పాను. కానీ, ఏక్తా కపూర్ పిలిస్తే కాదనడం సాధ్యం కాదని అతను స్పష్టం చేశాడు" అని శుభాంగి ఆత్రే తెలిపారు.

సీరియల్‌కు హీరోయిన్‌గా ఎంపిక

ఆ నిర్ణయమే తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని శుభాంగి చెప్పారు. 2007లో వచ్చిన 'కస్తూరి' సీరియల్ కోసం శుభాంగి ఆత్రేను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. అయితే ఆ రోజుల్లో సీరియల్ టెలికాస్ట్ డేట్ దగ్గరపడటంతో నటీనటుల మార్పులు వేగంగా జరిగాయి.

వారంలో 6 రోజులు నాన్-స్టాప్ షూటింగ్

"నెల 21వ తేదీన నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు నుంచి నేరుగా 27వ తేదీ వరకు నాకు ప్యాకప్ చెప్పలేదు. ఆరు రోజుల పాటు ఒక్క క్షణం కూడా సరిగ్గా నిద్రపోలేదు. వ్యానిటీ వ్యాన్‌లో కాసేపు కళ్లు మూసుకోవడం, ఒక సెట్ నుంచి మరో సెట్‌కు పరిగెత్తడం, పాత మేకప్‌పైనే కొత్త మేకప్ వేసుకోవడంతోనే సరిపోయింది" అని శుభాంగి ఆత్రే ఆనాటి కష్టాలను వివరించారు.

తిరుగులేని పాపులారిటీ.. ఆ తర్వాత ప్రయాణం

కరణ్ పటేల్ సరసన నటించిన 'కస్తూరి' సీరియల్ బుల్లితెరపై సంచలన విజయం సాధించింది. రెండేళ్లకు పైగా సాగిన ఈ సీరియల్ ద్వారా శుభాంగి ప్రతి ఇంటా గుర్తింపు పొందారు. ఆ తర్వాత 'భాబీజీ ఘర్ పర్ హై' సీరియల్‌లో 'అంగూరీ భాబీ' పాత్రతో దేశమంతటా అమితమైన ఆదరణ సొంతం చేసుకున్నారు.

వర్కౌట్ కానీ వెండితెర ఎంట్రీ

దాదాపు తొమ్మిదేళ్ల పాటు ఈ సీరియల్‌లో అలరించిన శుభాంగి ఆత్రే.. 2025లో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా శిల్పా షిండే ఆమె స్థానంలోకి వచ్చారు. ఇటీవల 2026లో వచ్చిన 'భాబీజీ ఘర్ పర్ హై: ఫన్ ఆన్ ది రన్' సినిమా ద్వారా వెండితెరపై అడుగుపెట్టినప్పటికీ, ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది.

విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టిన కష్టం

సినిమా ఫలితం ఎలా ఉన్నా, టీవీ రంగంలో ఆరంభంలో శుభాంగి పడిన కష్టం, చూపిన అంకితభావం ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. అదే ఆమెకు విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చిపెట్టింది.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu