తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ప్రభంజనం సృష్టించడం కేవలం రాజకీయాల్లోనే కాదు, దక్షిణ భారత సినీ పరిశ్రమలోనూ పెను సంచలనాన్ని రేపుతోంది.
దళపతి విజయ్ ఒక సూపర్ స్టార్ హోదా నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేది కోలీవుడ్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చివేయనుంది.
సినిమా పవర్ సెంటర్
దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమపై రాజకీయ పార్టీల (DMK, AIADMK) పరోక్ష ఆధిపత్యం ఉండేది. థియేటర్ల కేటాయింపు నుంచి టికెట్ ధరల వరకు ప్రభుత్వాల జోక్యం ఉండేది. ఇప్పుడు సాక్షాత్తు ఒక అగ్ర హీరోనే అధికారంలోకి రావడంతో, సినిమా పరిశ్రమకు సంబంధించిన సమస్యలు నేరుగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. పరిశ్రమపై పట్టు ఇప్పుడు సినీ నేపథ్యం ఉన్న నాయకుడికి బదిలీ అయ్యింది.
దళపతి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?
విజయ్ రాజకీయాల కోసం సినిమాలకు పూర్తిగా స్వస్తి పలికారు. ఏటా రూ. 500-1000 కోట్ల బిజినెస్ చేసే ఒక భారీ మార్కెట్ ఇప్పుడు ఖాళీ అయ్యింది. ఆయన వదిలిన నంబర్ 1 స్థానం కోసం అజిత్, సూర్య, ధనుష్, శివకార్తికేయన్, విక్రమ్, విజయ్ సేతుపతి, కార్తీ వంటి హీరోల మధ్య పోటీ పెరగనుంది. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి కథనాయకులు ఆల్‌రెడీ చూడాల్సిన టాప్ ఇమేజ్‌ని చూసేశారు. విజయ్ సినిమాలకు ఉండే భారీ ఓపెనింగ్స్, ఫ్యాన్ బేస్‌ను ఏ హీరో తన వైపు తిప్పుకుంటారనేది ఇప్పుడు కోలీవుడ్‌లో ఆసక్తికర చర్చ.
చిన్న సినిమాలకు ప్లస్ అవుతుందా?
విజయ్ తన ప్రచారంలో కళాకారుల సంక్షేమం గురించి కూడా మాట్లాడారు. ఆయన గెలుపుతో షూటింగ్ పర్మిషన్లు సులభతరం కావడం, చిన్న సినిమాలకు సబ్సిడీలు పెరగడం వంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అలాగే, చలనచిత్ర కార్మికుల సమస్యలపై ఆయనకు పూర్తి అవగాహన ఉండటం పరిశ్రమకు ప్లస్ పాయింట్.
సినిమా కథల్లో కొత్త ఒరవడి
విజయ్ గెలుపు ఇతర హీరోలకు కూడా స్ఫూర్తినిస్తోంది. రాబోయే రోజుల్లో తమిళ సినిమాల్లో సామాజిక అంశాలు, రాజకీయ చైతన్యం పెంచే కథలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. విజయ్ బాటలో మరికొంతమంది నటులు రాజకీయాల వైపు అడుగులు వేయడానికి ఈ ఫలితాలు ధైర్యాన్ని ఇస్తున్నాయి.
తమిళ చిత్రసీమలో డీఎంకే, ఆ పార్టీ కుటుంబానికి చెందిన రెడ్ జెయింట్ అనే సంస్థ, డీఎంకే పాలనలో సినిమా నిర్మాణం, పంపిణీపై ఆధిపత్యం చెలాయించింది. రెడ్ జెయింట్ మూవీస్ చాలా థియేటర్లను నియంత్రిస్తోందని, ఇతర చిత్రాలను విడుదల చేయమని ఒత్తిడి చేస్తోందని చిత్ర పరిశ్రమలో పదేపదే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు విజయ్ రాకతో ఇందులో మార్పులు వస్తాయని అనుకుంటున్నారు.
సినీ ప్రముఖుల స్పందన
విజయ్ గెలుపుపై సినీ లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. చియాన్ విక్రమ్, శివకార్తికేయన్ వంటి హీరోలతో పాటు తెలుగు ఇండస్ట్రీ నుంచి నాని, నిఖిల్ వంటి నటులు కూడా దళపతికి శుభాకాంక్షలు తెలిపారు.
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎంజీఆర్, జయలలిత తర్వాత సినీ గ్లామర్‌ను అద్భుతమైన రాజకీయ శక్తిగా మార్చిన ఘనత విజయ్‌కే దక్కుతుంది. ఆయన గెలుపు కోలీవుడ్‌కు ఒక రక్షణ కవచంలా మారుతుందని, అదే సమయంలో సినిమా వ్యాపారంలో ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Anand Sai, Hyderabad

