Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Unified Welfare Card : తెలంగాణలో 'సమగ్ర సంక్షేమ కార్డు' - ఒకే ఐడీతో అన్ని పథకాల డేటా..! ఆధార్ తరహాలో నెంబర్ కూడా

Unified Welfare Card : తెలంగాణలో 'సమగ్ర సంక్షేమ కార్డు' - ఒకే ఐడీతో అన్ని పథకాల డేటా..! ఆధార్ తరహాలో నెంబర్ కూడా

Unified Welfare Card Telangana : రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే చోట లభించేలా ఒక విప్లవాత్మకమైన విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది.

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ అందుతున్న ప్రభుత్వ సాయాన్ని ఒకే గొడుగు కిందికి తెస్తూ 'సమగ్ర సంక్షేమ కార్డు'ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి ఏ శాఖ ద్వారా, ఏ పథకం కింద, ఎంత మేర లబ్ధి చేకూరుతోందో ఈ కార్డు ద్వారా స్పష్టంగా తెలిసేలా సమగ్రమైన నివేదికను సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు.

డేటా సేకరణకు ప్రత్యేక డ్రైవ్ - సీఎం

తక్షణమే అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని… అన్ని శాఖల నుంచి లబ్ధిదారుల డేటాను సేకరించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో ఏఐ సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందన్నారు.

ఈ విధానం అనుసరించడం వల్ల నిజమైన అర్హులకు పథకాలు మరింత కచ్చితంగా చేరుతాయని… అదే సమయంలో అనర్హులను గుర్తించడం సులభమవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి శాఖ వేర్వేరుగా కార్డులు ఇచ్చే పద్ధతికి బదులు…. ఐటీ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర సంక్షేమ కార్డ్ ఉండాలని సూచించారు. టెక్నాలజీపై పట్టున్న, చురుగ్గా పనిచేసే యువ అధికారులను ఈ ప్రక్రియకు వినియోగించాలని చెప్పారు.

ఈ కార్డ్‌లో ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయ నిధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, కార్మిక శాఖ, విద్యా శాఖ, బీమా పథకాలు, ప్రభుత్వం తీసుకొస్తున్న బీమా పథకాల వివరాలు ఉండాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అవసరమైతే ఆధార్ నంబర్‌ తరహాలో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక యూనిక్ ఐడెంటిటీ నంబర్‌ ఇచ్చేలా ఆలోచించాలన్నారు.

ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల SEEEPC సర్వే వివరాలను కూడా ఈ కార్డ్‌కు అనుసంధానం చేయాలని చెప్పారు. లబ్ధిదారుల వివరాలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య, ఇతర వివరాలను సేకరించాలని ఐటీ శాఖను ఆదేశించారు.ఏఐ ఆధారిత ప్రొఫైలింగ్ జరగాలని సూచించారు.

ఎక్కడైనా మరణ ధృవీకరణ పత్రం జారీ అయితే…. ఆ సమాచారం చేయూత పెన్షన్ డేటాబేస్‌కు చేరాలని సీఎం ఆదేశించారు. వెంటనే దాని ఆధారంగా చర్యలు మొదలయ్యేలా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య ప్రొఫైల్‌ను కూడా సమగ్ర సంక్షేమ కార్డుతో లింక్ చేయాలని చెప్పారు.

కేరళ నుంచి గల్ఫ్‌కు వలస వెళ్లే ఉద్యోగులకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలతో పాటు, పాస్‌పోర్ట్‌లు, వీసాల జారీకి సంబంధించిన సమాచారం ఒకేచోట అందుబాటులో ఉంచితే…. అనధికార ఏజెంట్ల ప్రమేయం తగ్గుతుందని తెలిపారు. పేదలకు సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా చేరేలా,….ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం ప్రభావాన్ని అంచనా వేసేలా సమగ్ర సంక్షేమ కార్డు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu