Dailyhunt
Vaibhav Sooryavanshi : బుమ్రాని ఉతికేసిన వైభవ్​ సూర్యవంశీ! ఒకే ఓవర్​లో 2 సిక్సర్లు- ఫ్యాన్స్​ ఫిదా..

Vaibhav Sooryavanshi : బుమ్రాని ఉతికేసిన వైభవ్​ సూర్యవంశీ! ఒకే ఓవర్​లో 2 సిక్సర్లు- ఫ్యాన్స్​ ఫిదా..

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆ 'బాక్సాఫీస్' పోరు ముగిసింది. గౌహతిలోని బర్సాపరా స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ- జస్‌ప్రీత్ బుమ్రా మధ్య జరిగిన పోరు ప్రేక్షకులకు కనువిందు చేసింది.

వర్షం కారణంగా 11 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వేసిన తొలి బంతినే సిక్సర్‌గా మలచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేవలం 5 బంతుల్లోనే బుమ్రాపై 13 పరుగులు రాబట్టి ఈ 'మినీ-బ్యాటిల్'లో విజేతగా నిలిచాడు.

ఐపీఎల్​ 2026 : ఆర్​ఆర్​ వర్సెస్​ ఎంఐ- టాస్, వ్యూహం..

రాత్రి 10 గంటల తర్వాత ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ 11 ఓవర్లకే పరిమితం కావడంతో వైభవ్ ఎలాంటి భయం లేకుండా 'బంతిని చూడు.. బాదు' అనే మంత్రాన్ని అనుసరించాడు.

ఐపీఎల్​ 2026- బుమ్రాపై సూర్యవంశీ ఎదురుదాడి..

వైభవ్ సూర్యవంశీ తాను ఎదుర్కొన్న బుమ్రా తొలి బంతినే సిక్సర్‌గా మలిచి అందరి నోళ్లు వెళ్లబెట్టేలా చేశాడు. ఆ కుర్రాడి తెగింపు చూసి సాక్షాత్తు బుమ్రా ముఖంలోనే ఆశ్చర్యంతో కూడిన నవ్వు కనిపించింది. అంతటితో ఆగకుండా అదే ఓవర్లో మరో సిక్సర్ బాదేశాడు వైభవ్.

మొదటి సిక్స్: స్లాట్‌లో పడ్డ బంతిని వైభవ్ తన హిట్టింగ్ ఆర్క్ లోకి తీసుకుని భారీ సిక్సర్‌గా మలిచాడు.

రెండో సిక్స్: బుమ్రా వేసిన షార్ట్ బాల్‌ను వైభవ్ స్టాండ్స్‌లోకి పంపాడు.

మొత్తంగా బుమ్రా బౌలింగ్‌లో వైభవ్ 5 బంతులు ఎదుర్కొని 13 పరుగులు సాధించాడు. దీనిని బట్టి చూస్తే ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌పై ఈ 15 ఏళ్ల కుర్రాడు పైచేయి సాధించాడని చెప్పవచ్చు.

నిస్సహాయ స్థితిలో ముంబై సీనియర్లు..

వైభవ్ క్రీజులో ఉన్నంతసేపు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, బుమ్రా వంటి దిగ్గజాలు ఏం చేయాలో పాలుపోక నిస్సహాయంగా ఉండిపోయారు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో వరుసగా సిక్స్, ఫోర్ బాదినప్పుడు కెమెరాలు రోహిత్ వైపు మళ్లగా.. ప్లాన్స్ అమలు కాకపోవడంపై అతను తీవ్ర అసంతృప్తితో కనిపించారు.

ఫ్యాన్స్​ ఫిదా..

ఇప్పటికే దాదాపు ప్రతి బౌలర్​ని వైభవ్​ సూర్యవంశీ ఉతికారేశాడు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్​ 2026లో సూర్యవంశీ వర్సెస్​ బుమ్రా పోరు.. క్లాష్​ ఆఫ్​ టైటాన్స్​గా అందరు భావించారు. ప్రపంచ స్థాయి భయపడే బుమ్రా బౌలింగ్​లో సూర్యవంశీ 2 సిక్స్​లు బాదడం చూసి ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. "ఇండియన్ క్రికెట్​లో వైభవ్​ నెక్ట్స్​ బిగ్​ థింగ్" అంటూ అతనిపై ప్రశంసల వర్షాన్ని కురిపిస్తున్నారు.

అవుట్ అయిన తీరుపై అసంతృప్తి..

అయితే, 5వ ఓవర్ చివరి బంతికి శార్దూల్ ఠాకూర్ వేసిన వైడ్ స్లాట్ బంతిని హిట్ చేసే క్రమంలో వైభవ్ డీప్‌లో తిలక్ వర్మకు దొరికిపోయాడు. మంచి కనెక్షన్ దొరక్కపోవడంతో సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పెవిలియన్‌కు వెళుతున్న సమయంలో వైభవ్ తనపై తాను అరుచుకుంటూ, కీలక సమయంలో వికెట్ పారేసుకున్నందుకు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. వైభవ్ నిరాశ చెందినప్పటికీ, అంతర్జాతీయ క్రికెట్‌లో దిగ్గజాలకు సాధ్యం కాని రీతిలో బుమ్రాను చితక్కొట్టి తనేంటో ప్రపంచానికి చాటిచెప్పాడు.

ఐపీఎల్​ 2026- ఆర్​ఆర్​ వర్సెస్​ ఎంఐ స్కోరు వివరాలు:

వైభవ్ 39 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు, యశస్వి జైస్వాల్ 77 పరుగులతో నాటౌట్‌గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ 11 ఓవర్లలో 150/3 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ 11 ఓవర్లలో 123/9 పరుగులకే పరిమితమై 27 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu