ఇండియన్ సినిమా ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రాజెక్టుల్లో ఒకటి 'వారణాసి' (Varanasi). ఐకాన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ సినిమా రిలీజ్ కానుండగా.. సరిగ్గా 365 రోజులు ఉందంటూ కీరవాణి చేసిన ట్వీట్, దానికి కార్తికేయ ఇచ్చిన రిప్లై వైరల్ అవుతున్నాయి.
ఏడాది కౌంట్‌డౌన్.. టీమ్ సందడి
వారణాసి మూవీ ఈరోజు అంటే మంగళవారం (ఏప్రిల్ 7, 2026) నుంచి సరిగ్గా 365 రోజుల్లో విడుదల కానుండటంతో చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా కౌంట్‌డౌన్ ప్రారంభించింది.
"మనం కాలంతో పోటీ పడుతూ ఏడాది ముందుకు వెళ్తే.. ఇక షో టైమ్ మొదలైనట్లే" అంటూ మేకర్స్ చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి కేవలం "365" అని పోస్ట్ చేస్తూ విడుదల సమయాన్ని గుర్తుచేశాడు. దీనిపై నిర్మాత ఎస్ఎస్ కార్తికేయ స్పందిస్తూ.. "అది సరే.. మరి సాంగ్ ఎప్పుడు డెలివరీ చేస్తావ్?" అని సరదాగా ప్రశ్నించడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
షూటింగ్ అప్‌డేట్.. సెట్ పనులు షురూ
వారణాసి సినిమా అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చిన ఒక పోస్ట్ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. "సెట్ వేస్తున్నారంటగా.. డైరెక్టర్ హ్యాపీనా?" అంటూ చేసిన పోస్ట్ చూస్తుంటే.. హైదరాబాద్‌లో షూటింగ్ కోసం భారీ సెట్టింగ్స్ సిద్ధమవుతున్నాయని అర్థమవుతోంది.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ భాగ్యనగరంలోనే జరుగుతోంది. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది.
రూ.1300 కోట్ల బడ్జెట్.. భారీ తారాగణం
శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా సుమారు రూ. 1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ మూవీలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా 'మందాకిని' పాత్రలో నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ 'కుంభ' అనే పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నాడు.
ఇక ఆర్. మాధవన్ హనుమంతుని పాత్రలో మెరవనుండగా, ప్రకాష్ రాజ్ మరో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. రాజమౌళి మార్క్ మేకింగ్, మహేష్ బాబు మేకోవర్ కలిసి ఈ సినిమాను ఇండియన్ సినిమా గర్వించదగ్గ స్థాయిలో నిలబెడతాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'వారణాసి' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: ఈ మూవీ ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రశ్న: ఈ చిత్రంలో నటించే ప్రధాన నటీనటులు ఎవరు?
జవాబు: మహేష్ బాబు హీరోగా నటిస్తుండగా, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ఆర్. మాధవన్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రశ్న: సినిమాకు సంగీతం ఎవరు అందిస్తున్నారు?
జవాబు: ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.
Hari Prasad S, Hyderabad

