Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వీడియో : 'పరకాల' వివాదం వేళ ఇంట్రెస్టింగ్ సీన్ - సీఎం రేవంత్‌ ఇంటికి కొండా సురేఖ ! రాఖీ కట్టి...

వీడియో : 'పరకాల' వివాదం వేళ ఇంట్రెస్టింగ్ సీన్ - సీఎం రేవంత్‌ ఇంటికి కొండా సురేఖ ! రాఖీ కట్టి...

క్షా బంధన్ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మంత్రులు కొండా సురేఖ, సీతక్క కలిశారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఇరువురు మంత్రులు రాఖీలు కట్టి, శుభాకాంక్షలు తెలియజేశారు.

అయితే…. ఇటీవల వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత మంత్రి కొండా సురేఖ తొలిసారిగా ముఖ్యమంత్రి నివాసానికి రావడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రితో భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ మీడియాతో ఏమీ మాట్లాడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయా.

కొండా సురేఖ ట్వీట్…

ఈ భేటీ అనంతరం మంత్రి కొండా సురేఖ సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. "నేడు రాఖీ పౌర్ణమి సందర్భంగా సహచర మంత్రి సీతక్కతో కలిసి సోదరులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో కలసి రాఖీ కట్టాను. మహిళల సంక్షేమం, సాధికారతకు ప్రజా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ, రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు పెద్దన్నగా అండగా నిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. మీ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను" అని పేర్కొన్నారు.

ఇటీవల ములుగు, పరకాల నియోజకవర్గాల్లో నిర్వహించిన పలు అధికారిక కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేబినెట్ మంత్రి కొండా సురేఖ ఈ పర్యటనలకు దూరంగా ఉన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక జిల్లా మంత్రి పాల్గొనకపోవడం అప్పట్లోనే అధికార కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.

పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శైలిని మంత్రి కొండా సురేఖ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పరకాలలో తమ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను అణగదొక్కేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ వివాదం నడుస్తుండగానే, పరకాల బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే శాసనసభ ఎన్నికల్లో రేవూరి ప్రకాశ్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని సభముఖంగా పిలుపునిచ్చారు. దీని ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ పరకాల కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాశ్ రెడ్డేననే స్పష్టమైన సంకేతాన్ని సీఎం ఇచ్చారు.

కుమార్తె వ్యాఖ్యలు - కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె సుస్మిత పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో అనుచరులతో సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె ముఖ్యమంత్రితో పాటు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో పరకాల నుంచే తాను పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించారు.

నేరుగా ముఖ్యమంత్రిపైనే విమర్శలు చేయడాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించింది. ఈ పరిణామాలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది. అయితే, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను ఎలా బాధ్యురాలినవుతానని మంత్రి సురేఖ కమిటీకి సమాధానం ఇచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారాన్ని తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా భావిస్తున్న పార్టీ నాయకత్వం, కేవలం నోటీసులతో వదలకుండా తదుపరి చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల నడుమ కొండా సురేఖ నేరుగా సీఎం నివాసానికి వచ్చి రాఖీ కట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu