Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విదుర నీతి: ఈ 5 రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే జీవితమే నాశనం!

విదుర నీతి: ఈ 5 రకాల వ్యక్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.. లేదంటే జీవితమే నాశనం!

హాభారతంలో అత్యంత మేధావిగా, ధర్మమూర్తిగా మహాజ్ఞాని విదురుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'విదుర నీతి' కేవలం ఆ కాలానికే పరిమితం కాలేదు, నేటి డిజిటల్ యుగంలోనూ మనిషి జీవన విధానాన్ని మార్చగల శక్తి దానికి ఉంది.

మనిషి జీవితంలో విజయం సాధించాలన్నా, సుఖశాంతులతో జీవించాలన్నా మంచి స్నేహ సంబంధాలు చాలా అవసరం. అయితే, కొందరి సావాసం జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. అలాంటి ప్రమాదకరమైన 5 రకాల వ్యక్తుల గురించి విదురుడు ఎప్పుడో హెచ్చరించాడు. వారిని జీవితంలో దరిచేరనీయకపోవడమే మంచిదని ఆయన స్పష్టం చేశారు. ఆ వ్యక్తులు ఎవరంటే...

వెన్నుపోటు పొడిచే మోసగాళ్లు

ఎదుటేమో అతిగా పొగడటం, వెనుక మాత్రం మన గురించే చెడుగా మాట్లాడటం కొందరి నైజం. ఇలాంటి వ్యక్తులతో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని విదుర నీతి చెబుతోంది. "ఎదుట ఒకలా, వెనుక మరోలా మాట్లాడేవారిని నమ్మితే జీవితంలో కోలుకోలేని దెబ్బతింటాం," అని విదురుడు హెచ్చరించారు. సమాజంలో మన పరువు తీయడానికి వీరు ఏ క్షణమైనా వెనుకాడరు. అందుకే ముఖం మీద నిక్కచ్చిగా మాట్లాడేవారే నిజమైన మిత్రులని గ్రహించాలి.

తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవారు

ఏ చిన్న విషయానికైనా ఆలోచించకుండా హడావుడిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం ఉన్నవారికి దూరంగా ఉండాలి. తొందరపాటు ఎప్పుడూ నష్టాన్నే మిగులుస్తుంది. విదుర నీతి ప్రకారం, ప్రశాంతత, సహనం లేని వ్యక్తి కేవలం తన సర్వనాశనం కోరుకోవడమే కాకుండా, తనతో పాటు ప్రయాణించేవారిని కూడా కష్టాల్లోకి నెడతాడు. కాబట్టి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సంయమనంతో వ్యవహరించే వివేకవంతుల సావాసాన్ని ఎంచుకోవడం ఉత్తమం.

ఇతరులకు కీడు తలపెట్టే స్వార్థపరులు

ఎల్లప్పుడూ పక్కవారికి ఎలా నష్టం చేకూర్చాలా అని ఆలోచించే దుర్మార్గుల సావాసం పాముతో సమానం. కష్టకాలంలో వీరు ఏనాడూ తోడుగా నిలవరు సమస్యలను తెచ్చిపెడతారు. జీవితంలో ఎలాంటి వారినైనా స్నేహితులుగా చేసుకునే ముందు వారి స్వభావాన్ని పూర్తిగా పరిశీలించాలని విదురుడు సూచించారు. స్వార్థపరులైన మనుషుల మాటలను నమ్మి మోసపోవద్దు.

గౌరవం ఇవ్వని వ్యక్తులు

సమాజంలో ఎదుటివారికి ఏ మాత్రం విలువ ఇవ్వని, చిన్నచూపు చూసేవారిని నమ్ముకుంటే మన ఆత్మవిశ్వాసమే దెబ్బతింటుంది. "ఎక్కడ గౌరవం లభించదో, అక్కడ క్షణం కూడా నిలబడకూడదు," అనేది పెద్దల మాట. స్వార్థం కోసం ఎదుటివారిని అవమానించే స్వభావం ఉన్నవారు అవసరమైనప్పుడు ద్రోహం చేయడానికి వెనుకాడరు. కాబట్టి మనల్ని గౌరవించే బంధాలకే విలువ ఇవ్వాలి.

కోపాన్ని అదుపులో ఉంచుకోలేని క్రోధితులు

చిన్నచిన్న విషయాలకే విపరీతంగా కోప్పడేవారు, తమ ఆగ్రహాన్ని నియంత్రించుకోలేనివారు ఎప్పుడూ చుట్టూ అశాంతిని నింపుతారు. కోపంలో వీరు ఏ తప్పు చేయడానికి అయినా వెనుకాడరు. అలాంటి వారి ప్రభావం వారి పక్కన ఉండేవాళ్లపై తీవ్రంగా పడుతుంది. ప్రశాంత మనస్తత్వం ఉన్నవారి సావాసం మనసుకు నెమ్మదినిస్తుంది. కోపాన్ని శాసించలేని మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.

మహాత్ముడైన విదురుడు చెప్పిన ఈ హెచ్చరికలను పాటిస్తే జీవితంలో అనవసరమైన మానసిక వేదనలు, పెద్ద ప్రమాదాల నుంచి సులభంగా బయటపడవచ్చు.

Peddinti Sravya, hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu