Dailyhunt
Vijay TVK : తమిళనాడులో హంగ్​- విజయ్​ సీఎం అవ్వాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్​ ఇవే..

Vijay TVK : తమిళనాడులో హంగ్​- విజయ్​ సీఎం అవ్వాలంటే ఏం చేయాలి? ఆప్షన్స్​ ఇవే..

Vijay as CM scenarios : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి! సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

2024లో పార్టీని స్థాపించిన విజయ్, కేవలం రెండేళ్లలోనే తిరుగులేని శక్తిగా ఎదిగారు. అయితే, మ్యాజిక్ ఫిగర్‌కు కొద్ది దూరంలో నిలిచిపోవడంతో ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. విజయ్​ నెక్ట్స్​ ఏం చేస్తారు? ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? అన్న విషయంపై ఆసక్తి నెలకొంది. మరి ప్రస్తుతం విజయ్​ ముందున్న ఆప్షన్లు ఏంటి? ఇక్కడ చూడండి..

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- గణాంకాలు ఇలా..

మొత్తం 234 స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 118 స్థానాలు అవసరం.

టీవీకే (విజయ్ పార్టీ): 107 స్థానాలు (ఒంటరిగా పోటీ చేసింది)

డీఎంకే కూటమి: 74 స్థానాలు

ఎన్డీఏ (ఏఐఏడీఎంకే+ బీజేపీ కూటమి): 53 స్థానాలు

ఇతరులు: 0 స్థానాలు

విజయ్​కి చెందిన టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 11 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో విజయ్ ముందున్న దారులు ఏంటి? 1967 తర్వాత డీఎంకే, ఏఐఏడీఎంకే కాకుండా వేరే పార్టీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహిస్తుందా?

విజయ్ సీఎం అయ్యేందుకు ఉన్న 3 అవకాశాలు..

1. డీఎంకే కూటమిలోని చిన్న పార్టీల మద్దతు

డీఎంకే కూటమిలో ఉన్న చిన్న పార్టీలను తనవైపు తిప్పుకోవడం విజయ్ ముందున్న మొదటి అవకాశం.

డీఎంకే మినహా ఆ కూటమిలోని మిగతా పార్టీలకు కలిపి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

కాంగ్రెస్ (5 సీట్లు): ఎన్నికలకు ముందే విజయ్‌తో కలవాలని కాంగ్రెస్‌లోని ఒక వర్గం భావించింది. ఇప్పుడు వారు టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది.

లెఫ్ట్ పార్టీలు (సీపీఐ, సీపీఎం): వీరిద్దరికీ కలిపి 4 సీట్లు ఉన్నాయి.

వీసీకే (దళిత పార్టీ): వీరు మద్దతు ఇస్తే విజయ్ సులభంగా 118 మార్కును దాటవచ్చు.

అయితే, ఇది జరిగితే జాతీయ స్థాయిలో 'ఇండియా' కూటమిపై ప్రభావం పడుతుంది. కాంగ్రెస్ తనను మోసం చేసిందని డీఎంకే భావించే ప్రమాదం ఉంది. ఫలితంగా 2029 లోక్​సభ ఎన్నికల్లో మోదీ బీజేపీని ఓడించడం కాంగ్రెస్​కి కష్టమవుతుంది.

2. డీఎంకే కూటమి పూర్తి మద్దతు

మొత్తం డీఎంకే కూటమి విజయ్‌కు బయటి నుంచి మద్దతు ఇవ్వడం రెండో మార్గం. ఇది రాజకీయంగా, గణితపరంగా సాధ్యమే. దీనివల్ల జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమి మరింత బలపడుతుంది.

అడ్డంకి: విజయ్ తన ప్రసంగాల్లో డీఎంకేను "రాజకీయ ప్రత్యర్థి"గా అభివర్ణించారు. స్టాలిన్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత వల్లే ప్రజలు తనకు ఓటేశారని విజయ్ భావిస్తే, ఆయన డీఎంకేతో కలవడానికి ఇష్టపడకపోవచ్చు.

3. ఏఐఏడీఎంకే మద్దతు

ప్రతిపక్షంలో ఉన్న ఏఐఏడీఎంకే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం మూడో దారి. కానీ దీనికి అనేక అడ్డంకులు ఉన్నాయి:

బీజేపీ ఫ్యాక్టర్: విజయ్ మొదటి నుంచి బీజేపీని తన "సైద్ధాంతిక శత్రువు"గా ప్రకటించారు. ఏఐఏడీఎంకే ప్రస్తుతం ఎన్డీయేలో ఉంది. విజయ్‌తో కలవాలంటే ఏఐఏడీఎంకే ముందుగా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సి ఉంటుంది.

అవినీతిపై పోరాటం: ఏఐఏడీఎంకే, బీజేపీలపై ఉన్న "అవినీతి, విభజన రాజకీయాల" ముద్ర కారణంగా వారితో కలిసే ఆసక్తి లేదని టీవీకే వ్యూహకర్త జాన్ ఆరోగ్యసామి స్పష్టం చేశారు.

మరి వీటిల్లో విజయ్​ ఏ దారిని ఎంచుకుంటారు? అనేది ఇంకొన్ని రోజుల్లో తేలిపోతుంది.

అతిపెద్ద పార్టీగా అవతరించినందున, గవర్నర్ మొదట విజయ్‌నే ప్రభుత్వం ఏర్పాటు చేయమని కోరే అవకాశం ఉంది. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకుంటే విజయ్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Chitturi Eswara Karthikeya Sharath

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu