Dailyhunt
Virat Kohli Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మాయ.. విరాట్ కోహ్లి రివ్యూ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

Virat Kohli Dhurandhar 2 Review: రణ్‌వీర్ సింగ్ ధురంధర్ 2 మాయ.. విరాట్ కోహ్లి రివ్యూ చూస్తే గూస్‌బంప్స్ రావాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఆదిత్య ధర్ కాంబినేషన్‌లో వచ్చిన స్పై థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్' (ధురందర్ 2) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.

విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న ఈ చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఈ సినిమాను చూసి సోషల్ మీడియాలో తన రివ్యూ పంచుకున్నాడు.

కోహ్లి ధురంధర్ 2 రివ్యూ

ధురంధర్ 2 మూవీ తనకు ఒక అద్భుతమైన "సినీ అనుభూతిని" ఇచ్చిందని విరాట్ కోహ్లి తెలిపాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో సినిమా పోస్టర్‌ను షేర్ చేస్తూ విరాట్ కోహ్లి తన రివ్యూను పోస్టు చేశాడు.

"ధురంధర్ 2 చూశా. ఇండియన్ సినిమాల్లో ఇలాంటి అనుభవం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదని చెప్పగలను. సినిమా దాదాపు 4 గంటల నిడివి ఉన్నా, ఒక్క క్షణం కూడా కనురెప్ప వేయలేకపోయా. ఈ సినిమా ప్రతి రకమైన ఎమోషన్‌ను బయటకు తీసింది" అని కోహ్లి రాసుకొచ్చాడు.

వావ్ అంటూ

దర్శకుడు ఆదిత్య ధర్ ప్రతిభను 'జీనియస్' అని అభివర్ణించిన కోహ్లి.. హీరో రణ్‌వీర్ సింగ్ గురించి ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు. "సినిమాలోని నటీనటులందరూ అద్భుతంగా నటించారు. కానీ రణ్‌వీర్ సింగ్ ఈ సినిమాతో నువ్వు మరో స్థాయికి చేరుకున్నావు. నీ నటన అద్భుతానికి అతీతం. అబ్సల్యూట్లీ వావ్!" అంటూ కోహ్లి తన స్టోరీలో పేర్కొన్నాడు.

ఆదిత్య ధర్ ఎమోషనల్ రిప్లై

కోహ్లి ప్రశంసలపై దర్శకుడు ఆదిత్య ధర్ స్పందిస్తూ భావోద్వేగానికి లోనయ్యాడు. కోహ్లీని 'వన్స్-ఇన్-ఏ-జనరేషన్ లెజెండ్' అని పేర్కొంటూ.. "విరాట్, నీ నుంచి ఇలాంటి ప్రశంసలు రావడం నిజంగా గొప్ప విషయం. నీ అండర్-19 ప్రపంచకప్ రోజుల నుంచి నేను నీకు అభిమానిని. దేశం కోసం నువ్వు ఆడే తీరు మాకు స్ఫూర్తినిస్తుంది. మా సినిమాల ద్వారా భారత్ గర్వపడేలా చేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాం. జై హింద్," అని రిప్లై ఇచ్చాడు.

రికార్డుల వేటలో 'ధురంధర్ 2'

2025 డిసెంబర్‌లో విడుదలైన 'ధురంధర్' మొదటి భాగం ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక మార్చి 19, 2026న విడుదలైన రెండో భాగం 'ధురంధర్: ది రివెంజ్' అంతకు మించి దూసుకుపోతోంది. మొదటి రోజే రూ.145 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం.. ఇప్పటివరకు గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ₹రూ.600 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

ఇండియాలో రూ.1000 కోట్ల నెట్ కలెక్షన్ల మార్కును చేరుకున్న తొలి హిందీ చిత్రంగా ధురంధర్ 2 రికార్డు సృష్టించింది.

కథా నేపథ్యం

ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్ 'హంజా' అలియాస్ జస్కిరత్ సింగ్ రంగీ అనే గూఢచారి పాత్రలో నటించాడు. పాకిస్థాన్‌లోని లియారీలో ఉన్న ఉగ్రవాద నెట్‌వర్క్‌లను తుత్తునియలు చేసే మిషన్‌లో అతను ఎదుర్కొన్న సవాళ్లు, ఆ పాత్ర వెనుక ఉన్న గతం ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ. రణ్‌వీర్ తో పాటు సంజయ్ దత్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి దిగ్గజ నటులు కీలక పాత్రల్లో మెరిశారు.

Chandu Shanigarapu

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu