Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వివిధ కోర్సుల కోసం జర్మన్ విశ్వవిద్యాలయంతో ఓయూ, కేయూ ఒప్పందం

వివిధ కోర్సుల కోసం జర్మన్ విశ్వవిద్యాలయంతో ఓయూ, కేయూ ఒప్పందం

తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థలైన ఉస్మానియా యూనివర్సిటీ (OU), కాకతీయ యూనివర్సిటీ (KU) గ్లోబల్ విద్యా రంగంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాయి.

జర్మనీకి చెందిన ప్రముఖ ప్రభుత్వ విద్యాసంస్థ రాయ్‌ట్లింగెన్ యూనివర్సిటీతో విద్యా రంగానికి సంబంధించి కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యం ద్వారా బ్యాచిలర్, మాస్టర్స్ కోర్సులు అభ్యసించే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో నాణ్యమైన విద్య, విదేశీ పరిశ్రమలలో అనుభవం, ఉద్యోగ అవకాశాలు సులభంగా లభించనున్నాయి.

ఐదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల విద్యాసంస్థల మధ్య నాలెడ్జ్ షేరింగ్, పరిశోధనలు వేగవంతం కానున్నాయి. ప్రారంభంలో కంప్యూటర్ సైన్స్, ప్రొఫెషనల్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ విభాగాలలో ఈ కార్యక్రమాలను అమలు చేస్తారు.

రాబోయే రోజుల్లో డిజిటల్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌తో పాటు ఇతర ప్రాథమిక ఇంజినీరింగ్ విభాగాలకు మాస్టర్స్ ప్రోగ్రామ్‌లను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన అంశం విద్యార్థుల ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం ప్రతిభావంతులైన 30 మంది విద్యార్థులను స్క్రీనింగ్ ద్వారా ఎంపిక చేసి నామినేట్ చేస్తుంది.

ఎంపికైన విద్యార్థులు జర్మనీలో మూడేళ్ల పాటు ఉంటూ అకాడమిక్ ఇమ్మర్షన్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ప్రత్యక్ష పారిశ్రామిక అనుభవాన్ని పొందుతారు. రాయ్‌ట్లింగెన్ విశ్వవిద్యాలయం తన పరిశ్రమల, విద్యా భాగస్వాములతో కలిసి జర్మనీలో అకాడమిక్ బోధన, మెంటార్‌షిప్, అడ్మినిస్ట్రేటివ్ ప్రక్రియను పర్యవేక్షిస్తుంది.

జర్మనీ విద్యా వ్యవస్థకు, అక్కడి పారిశ్రామిక రంగానికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నేరుగా జర్మన్ టెక్నాలజీ, వర్క్ కల్చర్‌ని అధ్యయనం చేసేందుకు ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. కోర్సు పూర్తి కాగానే యూరోపియన్ యూనియన్ మార్కెట్‌లో మెరుగైన ఉపాధి అవకాశాలు సాధించడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీగా నిలవనుంది.

ఈ ప్రతిష్టాత్మక ఒప్పంద కార్యక్రమ సమావేశంలో ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేష్ రెడ్డి తదితరులు పాల్గొని పత్రాలను మార్పిడి చేసుకున్నారు.

Anand Sai

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu