Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Weather Report : తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఐఎండీ అంచనాలు ఇలా

Weather Report : తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం - తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన, ఐఎండీ అంచనాలు ఇలా

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమమధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంపై బలమైన ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.

ఈ ఆవర్తన ప్రభావంతో రాబోయే రోజుల్లో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.

ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ బులెటిన్ ప్రకారం… ఇవాళ (ఆగస్ట్ 05, 2026) ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడొచ్చు.

వర్షాల సమయంలో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ముప్పు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువుల కాపరులు వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఆశ్రయం పొందవద్దని స్పష్టం చేశారు.

తెలంగాణకు వర్ష సూచన…

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం…. తెలంగాణలోనూ వర్ష ప్రభావం తీవ్రంగా ఉండనుంది. రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అంతేకాకుండా అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే వీలుంది.

ఇవాళ కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో తేలికపాటి లేదా ఉరుములతో కూడిన వర్షం పడొచ్చు. ఆయా జిల్లాల్లో 40 కిమీ వేగంతో గాలులు వీచే సూచనలున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆగస్టు 10వ తేదీ వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలు, వరద దాటికి… కృష్ణా బేసిన్‌లో నీటి ప్రవాహం జోరుగా కొనసాగుతోంది. శ్రీశైలంలోకి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం రిపోర్ట్ ప్రకారం… 2,39,891 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా…. ఇంకా పెరిగే అవకాశం ఉంది. జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్, జూరాల కుడి, ఎడమకాలువలతో సహా అన్ని కాలువలకు నీటి విడుదల కొనసాగుతోంది.

శ్రీశైలం మొత్తం నీటి సామర్థ్యం 215.810 టీఎంసీలుగా కాగా… ఇవాళ ఉదయానికి నీటినిల్వ 118.622 టీఎంసీలకు చేరింది. మరో 97 టీఎంసీలు చేరితే… ప్రాజెక్ట్ నిండుకుండలా మారిపోతుంది. ప్రస్తుతం ఔట్ ఫ్లో 800 క్యూసెకులుగా నమోదైంది.

Maheshwaram Mahendra Chary

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu