Yamuna Pushkaralu 2026: బృహస్పతి ఒక రాశి నుంచి ఇంకో రాశికి వెళ్లినప్పుడు, ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు మొదలవుతాయి. ప్రతి నదికి 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు వస్తూ ఉంటాయి.
గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించిన సమయంలో యమునా నది పుష్కరాలు ప్రారంభం అవుతాయి. ఈ కాలాన్ని యమునా పుష్కర మహోత్సవంగా భక్తులు జరుపుకుంటారు.
పుష్కరాల్లో మొదటి 12 రోజులను ఆది పుష్కరాలు అని, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలు అని అంటారు. లక్షలాది మంది దూర ప్రాంతాల నుంచి కూడా యమునా నది తీరాలకు వచ్చి స్నానాలు, పూజలు చేస్తూ ఉంటారు.
యమునా పుష్కరాలు 2026
యమునా పుష్కరాలు జూన్ 2, మంగళవారం నాడు ప్రారంభమవుతాయి. జూన్ 13, శనివారంతో ముగుస్తాయి. యమునా నదిలో పుష్కర స్నానం చేస్తే పాప విమోచనం కలుగుతుందని, అలాగే పితృ దోషాల నుంచి కూడా బయటపడొచ్చని పురాణాలు చెబుతున్నాయి.
యమునా నది పుష్కరాలు 2026 - ముఖ్యమైన స్నాన ఘాట్లు:
ఢిల్లీ, యమునానగర్, బృందావన్, ఆగ్రా, అలహాబాద్ ప్రాంతాల్లో యమునా నది పుష్కర ఘాట్ల పూర్తి వివరాలు ఉన్నాయి.
శ్రీకృష్ణుడు పుట్టిన మధురలో యమునా పుష్కర సమయంలో ఈ ఘాట్లను సందర్శించొచ్చు:
బెంగాలీ ఘాట్, విశ్రాంత్ ఘాట్, స్వామి ఘాట్, కంస ఘాట్, చక్రతీర్థ ఘాట్.
బృందావనం పుష్కర ఘాట్లు:
కేశీ ఘాట్, చీర ఘాట్, కాలీయ ఘాట్, ఇమ్లీ తాలా ఘాట్.
ప్రయాగరాజ్ యమునా పుష్కర ఘాట్లు:
త్రివేణి సంగమం, సరస్వతీ ఘాట్, అరైల్ ఘాట్.
ఢిల్లీలో:
నిగంబోధ్ ఘాట్, వజీరాబాద్ ఘాట్
యమునోత్రి, ఆగ్రాలో కూడా ఈ పుష్కర స్నానాలు చేయొచ్చు.
యమునా పుష్కరాల్లో ఏం చేయాలి?
పుష్కర స్నానం, దానధర్మాలు, పిండ ప్రదానాలు, పితృ తర్పణాలు, దీపదానం, యమునా హారతి, గాయత్రీ జపం, గోపూజ వంటివి చేయొచ్చు.
ఈ పుష్కర సమయంలో ఏ దానాలు చేయాలి?
పుష్కర సమయంలో 12 రోజులు ఏ దానాలు చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
మొదటి రోజు: ధన, ధాన్యాలు, భూదానం, సువర్ణ దానం, రజత దానం చేయడం వలన మంచి ఫలితాలను చూడొచ్చు.
రెండవ రోజు: వస్త్ర దానం, రక్తదానం, లవణ దానం చేయొచ్చు.
మూడవ రోజు: పూల దానం, బెల్లం దానం చేయడం వలన మంచి ఫలితాలు చూడొచ్చు.
నాలుగవ రోజు: నువ్వులు, నెయ్యి, పాలు, తేనె దానం చేయడం మంచిది.
ఐదవ రోజు: ధాన్య దానాలు, శకట దానం, వృషభ దానాలు చేయడం వలన మంచి జరుగుతుంది.
ఆరవ రోజు: చందనం, కస్తూరి, ఔషధాలను దానం చేయడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి.
ఏడవ రోజు: పీట, శయ్య, గృహ దానాలు చేస్తే మంచిది.
ఎనిమిదవ రోజు: చందనం, కందమూలాలు, పుష్పమాలలను దానం చేయడం మంచిది.
తొమ్మిదవ రోజు: పిండదానం, కన్యాదానం, కంబళి దానం చేయడం వలన మంచి ఫలితాలు చూస్తారు.
పదవ రోజు: కూరలు, పండ్లు వంటివి దానం చేయడం మంచిది.
పదకొండవ రోజు: గజదానం చేస్తే మంచిది.
పన్నెండవ రోజు: నువ్వుల దానం చేయడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.
Peddinti Sravya, hyderabad

