Yogi Adityanath: వారణాసిలో జరుగుతున్న 'సామ్రాట్ విక్రమాదిత్య' నాటక ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్..
భారతీయ సినిమా తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు సినిమాల్లో గొప్ప వ్యక్తులను విలన్లుగా, సమాజంలోని విలన్లను హీరోలుగా చూపే కాలం ఉండేదని, దాని ఫలితంగా తరాలు నాశనం అయ్యాయని ఆయన పేర్కొన్నారు. అన్యాయం, అణచివేత, దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు గొంతు ఎత్తలేకపోవడానికి ఇలాంటి సినిమాలు కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
నేరస్తులు రోల్ మోడల్స్ కాదు
యువతకు ఎటువంటి ఆదర్శాలను చూపిస్తున్నామనే దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. "మీరు ఒక దొంగను లేదా బందిపోటును హీరోగా చూపిస్తే, యువత వారిని తమ రోల్ మోడల్స్‌గా భావించడం మొదలుపెడతారు. సినిమాల్లో ఎప్పుడూ విలన్లను గ్లోరిఫై చేయకండి. సమాజ విలువలను పెంపొందించే బాధ్యత సినిమాపై ఉంది" అని ఆయన దర్శకులు, నిర్మాతలను కోరారు. భారతీయ సినిమా దేశ ఆదర్శాలను ప్రతిబింబించినప్పుడు అది సానుకూల పాత్ర పోషించిందని ఆయన గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కూడా పాల్గొన్నారు. సామ్రాట్ విక్రమాదిత్య జీవితంపై రూపొందించిన ఈ నాటకం కేవలం వినోదం మాత్రమే కాదు, నేటి తరానికి విద్యను కూడా అందిస్తుందని ఇద్దరు ముఖ్యమంత్రులు పేర్కొన్నారు.
విన్స్ గిల్లిగన్ వ్యాఖ్యలతో పోలిక
యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో వినిపిస్తున్న గొంతుకలను గుర్తు చేస్తున్నాయి. ప్రఖ్యాత సిరీస్ 'బ్రేకింగ్ బ్యాడ్' సృష్టికర్త విన్స్ గిల్లిగన్ కూడా ఇటీవల ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశారు. విలన్లను 'సెక్సీ'గా లేదా 'కూల్'గా చూపడం వల్ల వారు యువతకు ఆదర్శంగా మారుతున్నారని, ఇది సమాజానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.
భారతీయ సినిమాల్లో 'బందిపోటు రాణి' (Bandit Queen), 'పాన్ సింగ్ తోమర్', 'సోన్‌చిరియా' వంటి చిత్రాలు బందిపోటులను సానుభూతితో చూపించాయనే విమర్శలు గతంలోనే వచ్చాయి.
మొత్తానికి, సినిమాల్లో యాంటీ-హీరో ట్రెండ్ పెరిగిపోతున్న తరుణంలో, యోగి ఆదిత్యనాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
Written by Hari Prasad S, Hyderabad

