Dailyhunt
Zareen Khan: హీరోయిన్ ఇంట్లో నిన్న, ఇవాళ వరుస విషాదాలు- జరీన్ ఖాన్ తల్లి కన్నుమూత- నేడు సాయంత్రం అంత్యక్రియలు!

Zareen Khan: హీరోయిన్ ఇంట్లో నిన్న, ఇవాళ వరుస విషాదాలు- జరీన్ ఖాన్ తల్లి కన్నుమూత- నేడు సాయంత్రం అంత్యక్రియలు!

బాలీవుడ్ హీరోయిన్, తెలుగు చాణక్య ఫేమ్ జరీన్ ఖాన్ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె తల్లి పర్వీన్ ఖాన్‌ బుధవారం (ఏప్రిల్ 8) తుదిశ్వాస విడిచారు.

సుదీర్ఘ పోరాటం తర్వాత అనంత లోకాలకు..

హిందీ సినిమా 'వీర్' ద్వారా సల్మాన్ ఖాన్ సరసన వెండితెరకు పరిచయమైన జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్‌ మరణం చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొన్ని ఏళ్లుగా ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా 2016లో పర్వీన్ ఖాన్‌కు గుండె శస్త్రచికిత్స జరిగినప్పటి నుంచి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. పరిస్థితి విషమించడంతో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పర్వీన్ ఖాన్ కన్నుమూశారు.

"మా ప్రియతమ పర్వీన్ ఖాన్ (జరీన్ ఖాన్, సనా ఖాన్‌ల తల్లి) ఏప్రిల్ 8న శాంతియుతంగా స్వర్గస్తులయ్యారని తెలియజేయడానికి చింతిస్తున్నాం" అని జరీన్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ముంబైలోని వెర్సోవాలో బుధవారం (ఏప్రిల్ 8) సాయంత్రం పర్వీన్ ఖాన్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

పుట్టెడు దుఃఖంలో జరీన్ ఖాన్

జరీన్ ఖాన్ తన తల్లికి చాలా సన్నిహితంగా ఉండేవారు. గత కొన్ని నెలలుగా తన తల్లి ఆరోగ్య పరిస్థితిపై జరీన్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూనే ఉన్నారు. "అమ్మ మళ్లీ ఆసుపత్రిలో చేరారు.. దయచేసి ఆమె కోసం ప్రార్థించండి" అంటూ ఫిబ్రవరిలో జరీన్ ఖాన్ పెట్టిన పోస్ట్ ఆమె ఆవేదనను తెలియజేసింది. తన తల్లిని కాపాడుకోవడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. అయితే, విధి వెక్కిరించడంతో తల్లి జ్ఞాపకాలతో జరీన్ ఖాన్ మిగిలిపోయారు.

వరుస విషాదాలు

జరీన్ ఖాన్‌ను ఒకేసారి రెండు విషాదాలు చుట్టుముట్టాయి. తన తల్లి మరణించడానికి కేవలం ఒక్క రోజు ముందే (ఏప్రిల్ 7న), ఆమె ప్రాణంగా ప్రేమించే పెంపుడు పిల్లి 'రాంబో' కూడా మరణించింది.

"నా బిడ్డ నన్ను వదిలి వెళ్లిపోయింది" అంటూ నిన్ననే ఎమోషనల్ పోస్ట్ పెట్టిన జరీన్, ఇప్పుడు కన్నతల్లిని కోల్పోవడం జరీన్ ఖాన్‌కు కోలుకోలేని దెబ్బ తీసింది. వరుసగా ఎదురైన ఈ విషాదకర సంఘటనలు జరీన్ ఖాన్‌తోపాటు ఆమె అభిమానులను సైతం కలిచివేస్తున్నాయి.

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే

కాగా, సల్మాన్ ఖాన్ పక్కన భారీ అంచనాలతో కెరీర్ ప్రారంభించిన జరీన్ ఖాన్ కేవలం బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. గోపీచంద్ హీరోగా వచ్చిన తెలుగు యాక్షన్ థ్రిల్లర్ 'చాణక్య' సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు జరీన్ ఖాన్.

అలాగే రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన 'వీరప్పన్' చిత్రంలోనూ జరీన్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. పంజాబీ, తమిళ భాషల్లోనూ తన ముద్ర వేసిన జరీన్ 2020లో వచ్చిన 'హమ్ భీ అకేలే తుమ్ భీ అకేలే' తర్వాత వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమెకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.

Chetupelli Sanjiv Kumar, Hyderabad

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Hindustan Times Telugu